తమకు తామే హాని చేసుకునే ‘లెష్ నిహాన్ సిండ్రోమ్’
మెడి క్షనరీ
ఎవరైనా విపరీతంగా గోళ్లు కొరుక్కుంటుంటే ‘గోళ్లు కొరుక్కుంటున్నావా? వేళ్లు తినేసుకుంటున్నావా’ అంటూ కోప్పడతారు. సరిగ్గా లెష్ నిహాన్ సిండ్రోమ్ అనే వ్యాధితో పుట్టిన పిల్లలూ ఇదే పనిచేస్తారు. వాళ్లు తమ వేళ్లనో లేదా పెదవులనో కొరికేసుకునే అవకాశాలున్నాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ లెష్ అనే వైద్య విద్యార్థి, అతడి గురువు విలియమ్ నిహాన్ అనే పిల్లల వైద్యుడు 1964లో మొదటిసారి ఈ వ్యాధిని గుర్తించారు.
వారి పేరిటే ఈ వ్యాధిని లెష్-నిహాన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. జువెనైల్ గౌట్ అని కూడా పిలిచే ఈ వ్యాధి చాలా చాలా అరుదు. దాదాపు నాలుగు లక్షలమంది పిల్లల్లో ఒకరికి మాత్రమే కనిపించే ఈ వ్యాధి సోకిన పిల్లలు మొదటి ఏడాది నిండి రెండో సంవత్సరంలో ప్రవేశించాక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమ పెదవులనో, నాలుకనో. వేళ్లనో కొరికేసుకుంటూ తమను తామే గాయపరచుకుంటారు. జన్యుపరమైన మార్పుల కారణంతో ‘హైపోగ్జాంథిన్-గ్వానైన్ ఫాస్ఫోరైబోసిల్ ట్రాన్స్ఫరేజ్’ (హెచ్జీపీఆర్టీ) అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని గుర్తించారు.