ట్రిపుల్ తలాక్‌తో మహిళలకు అగౌరవం
► సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదన
► దానిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని వినతి
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వం ముస్లిం మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని, వారి సామాజిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అంతేకాక భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా రాతపూర్వక అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించింది. ముస్లిం మగవారితోనూ.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన మహిళలతోనూ పోలిస్తే ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ తదితర అంశాల వల్ల అసమానత్వాన్ని, దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్నారని తన అఫిడవిట్లో పేర్కొంది.
ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. అలాగే ఆరు దశాబ్దాలుగా ముస్లిం పర్సనల్ లాలో సంస్కరణలు తీసుకురాలేదని గుర్తుచేసింది. దీని వల్ల దేశ జనాభాలో 8 శాతం ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు.. తక్షణం విడాకులు వస్తాయనే భయంగా దుర్భర జీవితం గడుపుతున్నారని పేర్కొంది. ట్రిపుల్ తలాక్ వల్ల కొద్ది మంది మహిళలే ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారనేది నిజమని, అయితే వీటి పరోక్ష ప్రభావం వల్ల ప్రతి మహిళలోనూ అభద్రతాభావం, ఆందోళన, భయం ఉన్నాయనేది వాస్తవమని వివరించింది.
అయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వంటి కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం ఈ అంశంలో కోర్టుల ప్రమేయాన్ని వ్యతిరేకించాయి. పవిత్ర గ్రంథమైన ఖురాన్లో పేర్కొన్న ప్రకారమే ఇవి కొనసాగుతున్నాయని, ఈ అంశం న్యాయ పరిధిలోకి రాదని వాదించాయి. పలువురు ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్, బహుభార్యత్వాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
త్వరలో ట్రిపుల్ తలాక్‌కు స్వస్తి
బిజ్నూర్: మరో ఏడాదిన్నరలోనే ట్రిపుల్ తలాక్ ప్రక్రియకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) స్వయంగా ముగింపు పలికే అవకాశం ఉందని, అందువల్ల ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఏఐఎంపీఎల్బీ ఉపాధ్యక్షుడు కాల్బీ సాధిఖ్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.