విక్రయానికి కేజీ బ్లాక్ నికో వాటా
న్యూఢిల్లీ: కృష్ణా-గోదావరి బేసిన్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌లో వాటాను నికో రిసోర్సెస్ అమ్మకానికి పెట్టింది. మొత్తం 20 చమురు, సహజవాయువు నిక్షేపాలు ఈ బ్లాక్‌లో వున్నాయి. కెనడాకు చెందిన నికోకు ఇందులో 10 శాతం వాటా వుంది. సహజవాయువు ధరను ప్రభుత్వం అంచనాలకంటే తక్కువగా పెంచడం, భారత్‌లో గ్యాస్ వ్యాపారం భవిష్యత్ అనిశ్చితంగా వుంటుందని భావించడంతో తమ వాటాను విక్రయించాలని నిర్ణయించినట్లు నికో రిసోర్సెస్ చైర్మన్ కెవిన్ జే క్లార్క్ చెప్పారు.
ఇటీవల కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటా విక్రయానికి ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా జెఫ్రీస్ సంస్థను నియమించామన్నారు. కేజీ గ్యాస్ ధరను ఎంబీటీయూ (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్)కు 4.2 డాలర్ల నుంచి 5.61 డాలర్లకు గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం పెంచింది. పరిశ్రమ ఆశించిన ధర 8.4 డాలర్లకంటే ఇది తక్కువ. ఆ వాటా కావాలనుకుంటే దానిని కొనుగోలుచేసే తొలి హక్కు రిలయన్స్‌కే వుంటుంది. ఈ హక్కును రిలయన్స్ వినియోగించుకుంటుందో లేదో చూడాల్సివుంటుంది. ఈ బ్లాక్‌లో 60 శాతం ప్రధాన వాటా రిలయన్స్ వద్ద, మరో 30 శాతం ప్రపంచ ప్రసిద్ధ చమురు సంస్థ బీపీ వద్ద వుంది.