ఆయనో ఆల్‌రౌండర్..
సాక్షి: మనం ఏదైనా ఒక విషయాన్ని కచ్చితంగా తెలుసుకుని దాన్ని ఇతరులకు చెప్పినప్పుడు.. వారు దాన్ని అంగీకరించక పోయినా, లేక మనం చెప్పింది తప్పని హేలన చేసినా మనకు పట్టరానంత కోపం వస్తుంది కదా! ఎన్నో ఏళ్లు శోధించి సృష్టి రహస్యాలను కనిపెట్టి వాటిని ప్రపంచానికి తెలియ చేస్తే ఆయనకు సమాజం ఇచ్చిన బహుమతి మూర్ఖుడు, పిచ్చివాడు అనే బిరుదులు. అయినా ఆయన నిరాశ చెందలేదు. ఏదో ఒక రోజు తను కనుగొన్న నిజాలను ప్రజలు గుర్తించక పోతారా అన్న ఆశతో వాటిని భద్రపరిచి తనువు చాలించారు. ఆ తర్వాత గానీ ఆయన గొప్ప తనం ప్రపంచానికి తెలియలేదు. ఆయన చెప్పినవన్నీ అక్షర సత్యాలని తర్వాత నిరూపితమయ్యాయి. ఆయనే ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికస్. ఈరోజు ఆయన చేసిన పరిశోధనలు, జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం- విద్యాభ్యాసం:
నికోలస్ కోపర్నికస్ (1473-1543) మొట్టమొదటి సారిగా సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా ధ్రువపర్చిన శాస్త్రవేత్త. 1473లో జర్మనీలోని ధార్న్ అనే పట్టణంలో జన్మించారు. 1492లో క్రాకోవ్ విశ్వ విద్యాలయంలో చేరారు. ఆల్బర్ట్ బ్రుడ్జ్ దగ్గర శిష్యుడిగా పనిచేశారు. ఇటలీలోని బొలోగ్నా యూనివర్సిటీలో న్యాయ, గణిత, ఖగోళ శాస్త్రాలను అధ్యయనం చేశారు. కొన్ని ప్రఖ్యాత గ్రంథాలను కంఠస్థం చేయడం కోసం గ్రీకు భాష నేర్చుకున్నారు.
సందిగ్ధం ఏర్పడింది అక్కడే:
రోమ్ విశ్వ విద్యాలయంలో 29 ఏళ్ల వయసులో 1502లో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరారు. అక్కడ ఆయనకు భూమి, సూర్యుడు.. వీటిలో భూమికి కేంద్రకం ఏది అనే సందిగ్ధం ఏర్పడింది. టాలెమీ భూ కేంద్రక సిద్ధాంతాన్ని అరిస్టాటిల్ బలపర్చారు. పైథాగరస్ సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైందని నమ్మారు. వీటిలో ఏది నిజమని విశ్వసించాలో కోపర్నికస్‌కు అర్థం కాలేదు. ఈ విషయంపై ఆలోచిస్తూ చేస్తున్న వృత్తికి రాజీనామా చేసి తన పరిశోధనలు కొనసాగించారు.
సేవలు:
వైద్యునిగా, న్యాయమూర్తిగా కూడా ఎంతగానో రాణించారు. క్లిష్ట సమయాల్లో పోలెండ్‌కు అద్భుత సలహాలనిచ్చి ఆర్థిక దుస్థితి నుంచి బయటపడేశారు. పోప్ అభ్యర్థన మేరకు పంచాంగాన్ని సరిచేసి తిరుగులేని ఖగోళ శాస్త్రవేత్తగా పేరు గాంచారు. క్రీ.శ 1520లో అల్లెన్ స్టెయిన్ కాసిల్‌కు గవర్నర్‌గా పనిచేసి ట్యూటానిక్ యుద్ధ వీరులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ విధంగా ప్రజా సేవ, మత సంబంధ విషయాలు, శాస్త్రాలపై అధ్యయనం.. అన్ని రంగాల్లోనూ విశేషంగా రాణించారు.
సూర్య కేంద్రక సిద్ధాంతం:
సూర్య కేంద్రక సిద్ధాంతాల నమూనాలు, సిద్ధాంతాలను ఇతని కంటే ఎన్నో వందల ఏళ్ల ముందే ఆర్యభట్ట, ఒమర్ ఖయ్యంలు ప్రతిపాదించారు. కానీ గ్రహాల కదలికల ఆధారంగా వీటిని తొలిసారిగా కోపర్నికస్ నిరూపించారు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల రేయింబవళ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. భూ భ్రమణం, పరిభ్రమణం వల్ల రుతువులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఈ విషయాలన్నీ నిజమే అని కోపర్నికస్ విశ్వసించినా వాటిని బయటకు వెల్లడించడానికి ఆయనకు ధైర్యం చాలలేదు. అప్పట్లో ఎవరూ ఇతని సిద్ధాంతాలను విశ్వసించక పోవడమే దీనికి కారణం. జ్యోతిష్క గ్రంథాల్లో సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని రాసుండటం వల్ల అప్పట్లో ఎవరూ కోపర్నికస్‌ను నమ్మలేదు.
‘ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులుగా చేయడానికి ప్రయత్నిస్తున్న మూర్ఖుడు కోపర్నికస్’ అని మార్టిన్ లూథర్ దూషించారు. అయినప్పటికీ తాను తెలుసుకున్న, సేకరించిన వివరాలన్నింటినీ కోపర్నికస్ చివరి దశలో గ్రంథంగా అచ్చువేయించి పోప్‌గా ఉన్న మూడో పాల్‌కు అంకితం చేశారు. ఇది జర్మనీలోని న్యూవెంబర్గ్లో ప్రచురితమయ్యింది. ఈ పుస్తకంలోని అంశాలు సంఘ విద్రోహాన్ని సూచిస్తాయోమోనన్న భయంతో ప్రచురణ కర్తలు ‘దీన్ని విజ్ఞాన గ్రంథంగా పరిగణించ కూడదు’ అని ముందుగానే చెప్పారు. కానీ ఈ విషయం తెలియకుండానే కోపర్నికస్ 1543 మే 21న కన్నుమూశారు.