ఈ–సిగరెట్లు వద్దు!
డబ్ల్యూహెచ్ఓ సూచన
సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న ఈ–సిగరెట్ల (ఎలక్ట్రానిక్ సిగరెట్ల) వినియోగాన్ని కట్టడి చేసే చర్యలను ప్రపంచ దేశాలు పరిశీలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. సిగరెట్ మానేసేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని తన నివేదికలో తెలిపింది. పొగాకు నియంత్రణకు సంబంధించి సోమవారం నుంచి భారత్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ సూచన చేసింది.
– సాక్షి, ఏపీ డెస్క్
పొగాకు వినియోగం కారణంగా ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పొగాకు నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్’పై సంతకాలు చేసిన 180 దేశాలు సోమవారం భారత్‌లో సమావేశం కానున్నాయి. సమావేశపు అజెండాలో ‘వేపింగ్’ కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ–సిగరెట్లపై ఇంకా నిషేధం విధించని దేశాలు వాటిపై కఠిన నియంత్రణలు విధించే అంశాన్ని పరిశీలించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిం చింది. ఈ–సిగరెట్ల ఫ్లేవర్లపై నిషేధం విధించడంతో పాటు అమ్మకాలు, ప్రకటనలు, యువకులు వినియోగించడంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరింది.
కఠిన నిబంధనలు అవసరం...
నికోటిన్ విడుదల చేసే పరికరాల గురించి పలు దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నివేదిక రూపొందించామని కన్వెన్షన్ సెక్రటేరియట్ హెడ్ డాక్టర్ వెరా లూయిజా డిసిల్వా తెలిపారు. ‘ఈ–సిగరెట్లపై నియంత్రణలు ఉండాలని స్పష్టమైన అభిప్రాయం ఉంది. యువకులు, గర్భిణులు వీటిని వినియోగించడాన్ని ప్రోత్సహించకూడదు. కఠిన నియంత్రణలు అవసరం.’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ–సిగరెట్లను నిషేధించిన దేశాలు
అర్జెంటినా
బ్రెజిల్
కాంబోడియా
సింగపూర్
యుఏఈ
ఉరుగ్వే
వెనిజులా
సీషెల్స్
ఈ–సిగరెట్లూ ప్రమాదకరమే!
ఈ సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకర రసాయనాలే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రెండింటిలోనూ నికోటిన్ కామన్‌గానే ఉంటుందని, ఇది దానికి బానిస చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సిగరెట్లలోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలు, విషపూరిత రసాయనాలు ఉంటాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్ల నుంచి వచ్చే దుష్పరిణామాలు ఈ సిగరెట్లతోనూ వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటిల్లోనూ ఉండేది నికోటినే కా బట్టి, వీటికీ అడిక్ట్ అవుతారని పేర్కొంటున్నారు.
60 లక్షలు: ధూమపానం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న మరణాలు
6: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరు సెకన్లకు ఓ మరణం సంభవిస్తోంది
22%: ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో 22 శాతం మంది ధూమపానం సేవిస్తున్నారు.
12%: ప్రపంచవ్యాప్తంగా పొగతాగేవారిలో భారతీయులు
9: లక్షలు ధూమపానంతో భారత్‌లో ఏటా సంభవిస్తున్న మరణాలు