బొత్సకు షాక్!
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోలుకోలేని షాక్ తగిలింది. పదేళ్ల ఏకఛత్రాధిపత్యానికి గండిపడింది. ఆయన రాజకీయ కోట బీటలు వారింది. వైఎస్సార్ సీపీలోకి భారీగా నాయకులు చేరడంతో చీపురుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. రోజు వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు బొత్సకు చేయిచ్చారు.
ఆయనతో రాజకీయ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. ఆయన ప్రధాన అనుయాయుడు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి గురువారం వైఎస్సార్ సీపీలో చేరగా, మరో ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కాంగ్రెస్‌కు రాం...రాం చెప్పి, విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. ఆయనతో పాటు బొత్స సన్నిహితులైన 25 మంది తాజా, మాజీ సర్పంచ్‌లు, మరో 20 మంది మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ అధ్యక్షులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది.
వీరే కాదు నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా లో అనేక మంది కాంగ్రెస్ నాయకులు బొత్సను వది లేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కబంధహస్తాల నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఆయన బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడేది లేదంటూ నిష్ర్కమణకు సన్నద్ధమవుతున్నారు. షాడో నేత ఆగడాలు, సతాయింపు భరించాల్సిన రోజులు పోయాయని హెచ్చరిస్తున్నారు. మున్ముందు మరిన్ని వలసలు ఉంటాయని నేతలు చెప్పుకొస్తున్నారు.
ఫలించని బొత్స మంత్రాంగం
కోల్పోతున్న పట్టును నిలబెట్టేందుకు బొత్స తీవ్ర ప్రయత్నాలే చేశారు. వదిలి వెళ్లిపోతున్న నాయకుల విషయాన్ని తెలుసుకుని తెర వెనుక చాలా మంత్రాంగం నడిపారు. అటు మీసాల నీలకంఠంనాయుడిని, ఇటు బెల్లాన చంద్రశేఖర్, ఆయన అనుచరుల్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పిలిచి మాట్లాడారు. బంధుత్వం కలిపి ఒత్తిడి చేశారు. ఫోన్లు చేసి ప్రాధేయపడ్డారు. రకరకాలుగా ప్రలోభ పెట్టారు. కానీ పార్టీ మారిన నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. కనీసం మాట వినలేదు. ఇక కలిసి పనిచేయలేమని తెగేసి చెప్పేశారు. పరోక్షంగా మీకో దండమని చెప్పేసి వచ్చేశారు.
ఈ క్రమంలోనే చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో దాదాపు 25 మంది తాజా, మాజీ సర్పంచ్‌లు, మరో 20 మంది మాజీ ఎంపీటీసీలు, పీఏసీఎస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేసి, గురువారం రాత్రి రెండు బస్సులు, 20 కార్లలో బయలుదేరి వెళ్లి, విజయవాడలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మీసాల రమణ, కరిమజ్జి శ్రీనివాసరావు, కోరాడ రామారావు, గొర్లె రమణ, పిసిని శ్రీను, రెల్లి అప్పలనాయుడు, చింతాడ లక్ష్మణ, అధికార్ల శ్రీనుబాబు, బాణాన శ్రీనివాసరావు, చందక గురునాయుడు, పనస అప్పారావు, అంబల్ల రామకృష్ణ, రేవల్ల సత్తిబాబు, బూర్లె నరేష్, సరిది రమేష్, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తదితరులు ఉన్నారు.
ఆందోళనలో బొత్స..
నాయకులు, కార్యకర్తలు చేజారడంతో బొత్స టెన్షన్‌కు లోనవుతున్నట్టు తెలిసింది. రాజకీయ అస్థిరతను కోల్పోయే పరిస్థితి వస్తోందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. కేడర్‌ను నిలబెట్టకపోతే పుట్టి మునిగిపోయే పరిస్థితి ఉందని భయపడుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హుటాహుటిన చీపురుపల్లికి చేరుకుని, ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే మకాం పెడతానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, బొత్స సత్యనారాయణ ఇక్కడే పోటీ చేస్తారని నేతలతో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పించారు. వదిలి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గతంలో కలిసి పనిచేసిన నాయకులందరికీ ఫోన్ చేసి రావాలని కబురు పెట్టారు. కానీ స్పందన రాలేదు.