బెంగాల్ బాలిక కేసులో 9మంది అరెస్టు
విజయవాడ సిటీ : బెంగాలీ బాలికపై లైంగిక దాడి కేసులో తొమ్మిది మంది నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కమిషనరేట్ అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. అరెస్టు చేసిన వారిలో హైదరాబాద్ యూసఫ్‌గూడకు చెందిన తిర్నాతి సురేష్, గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఆత్కూరి రామకృష్ణ, జుజ్జులూరి ప్రభాకర రెడ్డి, గుంటూరు జిల్లా రొంపిచర్లకు చెందిన బండి సుబ్బారావు, నర్సరావుపేటకు చెందిన కందుకూరి వీర శంకరాచారి, హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఈమని కృష్ణమూర్తి, విజయవాడ వెంకటేశ్వరనగర్ కాలనీకి చెందిన పట్లూరి కృష్ణకిషోర్, శింగరాయకొండకు చెందిన పసుపులేటి రవితేజ, దూడల సాయి శ్రవణ్ ఉన్నారు. నిందితులపై పెనమలూరు పోలీసు స్టేషన్లో సెక్షన్ 376(2)(ఎన్), 376(డి), 366(ఎ), 343 ఐపీసీ, ఫోక్సో 2012 చట్టంలోని సెక్షన్ 6, ఐటిపీ 1956 చట్టంలోని సెక్షన్ 3,4,5,6 క్లాజుల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మైనరు బాలిక కుటుంబ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పోషణ నిమిత్తం స్నేహితురాలితో కలిసి ముంబై వెళ్లింది. ఆమె స్నేహితురాలు గత నెల 14న ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి రాంబాబు అనే వ్యక్తికి అప్పగించింది. ఆమెను మురళీనగర్కి చెందిన సురేష్, మరో యువతికి రాంబాబు అప్పగించాడు. ఆమెను వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి తేవడంతో పాటు కొందరు విటులతో కలిసి లైంగిక దాడి చేశారు. వీరి హింసలు భరించలేని స్థితిలో ఆమె డయల్ 100కి ఫోన్ చేసింది. దీంతో సురేష్ ఆమెను బస్టాండ్‌కు తీసుకెళ్లి బస్సెక్కించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వెంబడించడంతో పరారయ్యాడు. బాలిక ద్వారా విషయాలు తెలుసుకున్న పోలీసులు మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ టీఎస్ఆర్కె ప్రసాద్ నేతృత్వంలో విచారణ నిర్వహించి అరెస్టు చేశారు.
పోక్సో చట్టం ప్రకారం
పోక్సో చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం మైనరు బాలికపై ఏ విధమైన బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడినా తీవ్రమైన నేరంగా పరగణించి పదేళ్ల వరకు జైలు శిక్ష లేదా యవజ్జీవ శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయి.