మిత్రుడితో కలిసి... మట్టుబెట్టాడు
బొండపల్లి: వేదమంత్రాలు,అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి పెద్దలు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, అనందోత్సాహాల మధ్య తాళి కట్టిన భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. తన కాపురాన్ని పండించుకుందామని కోటి ఆశలతో మూడు నెలల క్రితం కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవవధువును భర్తే హతమార్చాడు. అనుమానం అనే పెను భూతం ఆవహించిన భర్త నిద్రిస్తున్న భార్య మెడకు తువ్వాలుతో బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. సభ్యసమాజం తల దించుకునే ఈ సంఘటన మండలంలోని ఒంపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బొండపల్లి మండలం ఒంపల్లి గ్రామానికి చెందిన టుంపిల్లి దండమ్మ కుమార్తె రామలక్ష్మి(19)ని అదే గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ లండముత్యాలనాయుడు కిచ్చి 2015 మే 7 వతేదీన వివాహం చేశారు.
వివాహం జరిగిన నాటి నుంచి ఆమెకు భర్త వేధింపులు మొదలయ్యాయి. కన్నీళ్లు దిగమింగుతూ కాపురం చేస్తున్న రామలక్ష్మి ఆషాఢమాసం కారణంగా గ్రామంలో ఉన్న కన్నవారింటికి వెళ్లింది. వారం రోజులుగా ముత్యాలనాయుడు పూటుగా మద్యం తాగుతూ భార్యతో తగాదా పడుతూ ఆమెను అం తమొందించేందుకు పథకరచన చేశాడు. గ్రామానికి చెందిన మిత్రుడు రామారావుతో కలిసి భార్య కన్నవారింటికి మంగళవారం సాయంత్రం వెళ్లా డు. ఇంటి వెనుక భాగం తలుపులు తీసి ఒక డు, ఇంటి ముందుభాగం నుంచి మరొకరు వెళ్లి ఇం ట్లో ప్రవేశించి మం చంపై నిద్రిస్తున్న రామలక్ష్మి మెడకు తువ్వాలుతో ఉరివేసి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి పరారయ్యారు.
కొంతసేపటికి ఇంటిలోకి వచ్చిన రామలక్ష్మి తల్లి దండమ్మ.. తన కూతురు విగతజీవురాలై పడి ఉండడాన్ని చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, గ్రామంలోని బంధువులు వచ్చారు. చివరకు తల్లి,బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. హత్య చేసిన పరారైన ముత్యాలనాయుడు, అతని స్నేహితుడిని గ్రామపెద్దలు గ్రామానికి రప్పించి పోలీసులకు అప్పగించారు. రామలక్ష్మికి తండ్రి రామజోగి, ఓ సోదరి ఉన్నారు.