రాజధానిలో పాక్ ఉగ్రవాదులు? హై అలర్ట్
న్యూఢిల్లీ: పంజాబ్ గురుదాస్ పూర్ బీభత్సాన్ని పాక్ ఉగ్రవాదులు ఇంకా కొనసాగించనున్నారా? దేశంలో మరింత బీభత్సాన్ని సృష్టించేందుకు పథక రచన చేస్తున్నారా? ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ నగరంలో మాటు వేసి వున్నారా? ఆగస్టు 15 సందర్భంగా భీకర దాడులతో విరుచుకుపడనున్నారా? నిఘా వర్గాల తాజా హెచ్చరికలను చూస్తోంటే...అవుననే అనిపిస్తోంది.
పాకిస్తానీ ఉగ్రవాదులు ఇప్పటికే నగరంలో తిష్టవేశారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తొమ్మిదిమంది అనుమానిత ఉగ్రవాదులు భారీపేలుడు పదార్థాలు సహా నగరంలోకి చొరబడ్డట్టు సమాచారం. పెద్ద ఎత్తున డిటొనేటర్ల, ఆర్డీక్స్ లాంటి భారీ పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి పథక రచన చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో హై ఎలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.
పంజాబ్ గురుదాస్ పూర్ ఉగ్రదాడి తరువాత ఇంటిలిజెన్స్ వర్గాల మరింత అప్రమత్తమ్యాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ఉగ్రవాదులు దేశంలో బీభత్సాన్ని సృప్టించేందుకు సిద్ధమవుతున్నట్టు గుర్తించాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 దేశ స్వాతంత్ర్య దినం సందర్భంగా టెర్రరిస్టులు ఎటాక్ చేసే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నాయి. దాదాపు మూడు నెలల క్రితమే భారీ ఎత్తున ఆయుధాలతో నగరంలోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాల సమాచారం.