వయసు తగ్గిస్తే నేరాలు తగ్గుతాయా?
జువైనెల్ చట్టంలో సవరణ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును సీపీఎం వ్యతిరేకిస్తోంది. 16 ఏళ్ల వయసున్న బాలురను వయోజనులుగా పరిగణించడం పూర్తిగా తప్పని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన సవరణకు తాము వ్యతిరేమని, రాజ్యసభలో దీన్ని అడ్డుకుంటామన్నారు. సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పరిశీలనకు పంపించాలని ఆమె డిమాండ్ చేశారు. బాల నేరస్తుడిని తీవ్రవవాదులను ఉంచే జైలుకు తరలించడాన్ని తప్పు బట్టిన ఆమె.. వయసు తగ్గించినంత మాత్రం స్త్రీలపై హింస ఆగుతుందని, న్యాయం జరుగుతుందని తాము భావించడం లేదన్నారు. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసే పటిష్టమైన వ్యవస్థ కావాలన్నారు.
మరోవైపు అసలు ఈ బిల్లు తీసుకురావొద్దంటూ బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చట్ట సవరణ చేయాల్సి వస్తే తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరగాలని బాలల హక్కుల కార్యకర్త కుమార్ వీ జాగిర్దార్ డిమాండ్ చేశారు. అటు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కాగా నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో శిక్షపడిన బాలనేరస్తుడి విడుదలను వ్యతిరేకిస్తున్న నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా సంఘం నేతలు పోరాటానికి దిగారు.