ఇక సరికొత్తగా నిరోధ్
ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనసంఖ్యకు అడ్డుకట్టవేసేందుకు భారత ప్రభుత్వం 50 ఏళ్ల కిందటే రూపొందించిన కుటుంబ నియంత్రణ మంత్రం.. నిరోధ్. హిందుస్థాన్ లాటెక్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన తొలి తరం కండోమ్ అప్పట్లో విశేష ఆదరణను చురగొంది. ఇటు జనాభా నియంత్రణకేకాక సుఖవ్యాధుల వ్యాప్తిని కూడా అడ్డుకుంది.
అయితే కండోమ్‌ల తయారీలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించడంతో నిరోధ్ నెమ్మదిగా తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. రకరకాల ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకున్న ప్రైవేట్ సంస్థలకు ధీటుగా నిరోధ్ను మార్కెట్లో మళ్లీ నంబర్ వన్‌గా కేంద్ర ప్రభుత్వం నిలబెట్టాలనుకుంటోంది . ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటయింది. సరికొత్త నిరోధ్ను ఏ ఫ్లేవర్లలో, ఎలాంటి రూపంలో తయారుచేయాలో ఈ కమిటీ నివేదించనున్నది. 'నామామాత్రపు ధరకు అందించేదే కదా ఎలా ఉంటే ఏముందిలే!' అనుకోకుండా నిరోధ్ కు మరింత ప్రాధాన్యత కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్యులు స్వాగతిస్తున్నారు.