అప్పన్న అన్న ప్రసాదం.. అ‘ధన’పు భారం!
సాక్షి, సింహాచలం (విశాఖపట్నం): అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు. అదీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆది వరాహమూర్తిగా అవతరించి, హిరణ్యాక్షుణ్ణి వధించిన పుణ్యక్షేత్రం, భక్తజన సిరి సింహగిరిపై అన్నప్రసాదం అంటే భక్తజన కోటికి మహా ప్రసాదం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు నోరారా గోవిందుడి నామాన్ని స్మరించాలని.. తరించాలని.. మనసారా కోరుకుంటారు. ఆనక కడుపారా స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం కలగాలని ప్రార్థిస్తారు. భగవంతుడు కరుణిస్తే మళ్లీ మళ్లీ ఆయన దర్శనభాగ్యం కల్పించాలని మొక్కుకుంటారు. అయితే సిరుల తల్లి శ్రీలక్ష్మిని చేతపట్టి వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా అవతరించిన సింహాచలేశుడి సన్నిధిలో భక్తులకు నిత్యాన్నదాన భారం అధికమవుతోందంటున్నారు ఆలయ అధికారులు.
భక్తజన కోటి మహా ప్రసాదంగా భావించే సింహాద్రి అప్పన్న అన్నప్రసాదం ఇక అందరికీ దొరక్కపోవచ్చు. నిత్యాన్నదాన పథకం నిర్వహణ వ్యయ భారం అవుతోందన్న నెపంతో భక్తుల సంఖ్యను కుదించే చర్యలకు దేవస్థానం పూనుకుంటోంది. సింహగిరిపై ఐదేళ్ల నుంచి ప్రతి రోజు 5 వేల మంది భక్తులకు నిత్యాన్నదాన పథకం కింద అందించే అన్నప్రసాదాన్ని ఇక నుంచి పరిమితం చేయాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో మినహా సోమవారం నుంచి శుక్రవారం వరకు 1800 మంది భక్తులకు అన్నప్రసాదం అందించి వ్యయ భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు బోగట్టా. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు దేవదాయ శాఖ కమిషనర్‌కు పంపించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో, రేపో విడుదల కానున్నట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి.
రూ.23 కోట్లకు చేరిన విరాళాలు
2014, ఆగష్టు వరకు ఆయా రోజుల్లో భక్తుల రద్దీ సంఖ్యకు అణుగుణంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందించేవారు. కానీ ఆ ఏడాది ఆగష్టు నుంచి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ప్రతి రోజూ 5 వేలు మందికి అన్నప్రసాదం అందించాలని సంకల్పించారు. ఆ మేరకు సింహాచలం దేవస్థానంలో కూడా రోజూ 5 వేల మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పద్ధతే కొనసాగుతోంది. అయితే రోజూ 5 వేల మందికి అన్నప్రసాదాన్ని అందించడం వల్ల నిత్యాన్నదాన పథకం నిర్వహణ భారమవుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ పథకానికి ఏడాదిలో వచ్చే వడ్డీకన్నా అదనంగా నగదు ఖర్చవుతోందని, మిగిలిన నిధులు వేరే విభాగాల నుంచి తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ప్రతి రోజూ ఒక భక్తుడి భోజనానికి రూ.24 వెచ్చిస్తుండగా.. ఆ లెక్కన 5 వేల మందికి రోజుకు సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతోంది. ఇలా సరాసరి ఏడాదికి పథకం నిర్వహణకు సుమారు రూ.3 కోట్లు వ్యయమవుతోంది. బ్యాంకులో ఉన్న రూ.23 కోట్ల డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ఏడాదికి కోటి నుంచి కోటిన్నర అదనపు భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ భారాన్ని దేవస్థానంలో ఉన్న మిగతా విభాగాల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
దీనిని అధిగమించేందుకు శని, ఆదివారాల్లో 5 వేల మందికి అన్నప్రసాదాన్ని అందించి, సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 వేల మందికి అందించే అన్నప్రసాదాన్ని 1800 మందికి పరిమితం చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు దేవస్థానాల్లో కూడా 5వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించడం లేదన్న విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా దేవస్థానం ఈవో విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు బోగట్టా.
ఇప్పటి వరకు అన్నదాన విరాళాలు: రూ.23 కోట్లు
దీనిపై బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ సుమారు: రూ.1.60 కోట్లు
ఏడాదికి అన్నదానానికి అయ్యే ఖర్చు: రూ.3 కోట్ల పైమాటే..
ఏడాదికి దేవస్థానంపై భారం సుమారు: రూ.1.5 కోట్లు
రూ.50 వేల విరాళంతో 1989లో శ్రీకారం
సింహగిరిపై 1989లో దేవస్థానం ఉద్యోగులు తొలి విరాళంగా రూ.50 వేలు అందించడంతో అన్నదాన పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకానికి దాతలు, భక్తులు రూ.1000 నుంచి రూ.లక్ష వరకు విరాళాలు అందిస్తున్నారు. అలా దాతలు ఇచ్చిన ఆ నగదును బ్యాంకుల్లో వేసి ఆ వచ్చే వడ్డీతో రోజూ భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. దాతలు కోరుకున్న రోజున వారి పేరిట అన్నదానం చేస్తున్నారు. అలా దాతలు అందించిన విరాళాలు ఇప్పటికి రూ.23 కోట్లకు చేరుకున్నాయి.
స్వామి ప్రసాదంపై ఆంక్షలా?
భక్తులకు అందించే స్వామి అన్నప్రసాదం విషయంలో ఆదాయ వ్యయాలు చూసుకోవడం ఏంటని పలువురు ఆక్షేపిస్తున్నారు. దేవస్థానంలో దివ్యక్షేత్రం పేరిట ఎన్నో అభివృద్ధి పనులు చేసేందుకు పూనుకున్న అధికారులు అన్నప్రసాదం విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్టు ఆలయ వర్గాలే చెబుతున్నాయి. సింహగిరిపై త్వరలో కాంట్రాక్ట్‌కు ఇచ్చిన అధునాతన క్యాంటీన్ ప్రారంభం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. అన్నప్రసాద పథకంలో ఇప్పటికీ బఫే పద్ధతి కొనసాగిస్తున్న అధికారులు వ్యయభారం నెపంతో భక్తుల సంఖ్యను మాత్రం కుదించడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయంపై పునరాలోచించుకుని, భక్తులందరికీ స్వామి అన్నప్రసాదం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.