మన రుచేమిటో చూపిస్తా...
నిన్న మొన్నటిదాకా ఎక్కడికక్కడికే పరిమితమైన కుకరీ కాంటెస్ట్‌లు మహిళల పుణ్యమాని ఇప్పుడు జాతీయస్థాయికి, ప్రపంచస్థాయికి విస్తరించాయి. బ్యూటీకాంటెస్ట్ ల తరహాలోనే వీటికీ మహిళల నుండి అమితమైన ఆదరణ లభిస్తుండడంతో అనేక వ్యాపారసంస్థలు ఈ పోటీల నిర్వహణకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎల్జి మల్లిక-ఇ-కిచెన్ ఫైనల్స్ లో కోయంబత్తూర్‌కు చెందిన కె.ఎన్.నిత్య గెలుపొందారు. (ఈ పోటీల్లో మన రాష్ట్రానికి చెందిన విజయవాడ యువతి పద్మశ్రీ కూడా పాల్గొన్నారు) తద్వారా దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచస్థాయి వంటల పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత పొందారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.
వంటల పోటీలో గెలుపొందడం ఎలా ఉంది?
నిత్య: ఒకరకంగా ఇది మిస్ ఇండియా పోటీల్లాంటిదే. అందుకే చాలా ఆనందంగా ఉంది. జాతీయస్థాయిలో కుకింగ్ క్వీన్ అనిపించుకోవడం విచిత్రంగా అనిపిస్తోంది.
మీ గురించి చెప్పండి?
నిత్య: పుట్టింది కోయంబత్తూర్. చదువుకుంది మాస్టర్స్ ఇన్ లా. హౌస్‌వైఫ్‌ని. భర్త డాక్టర్. మాకు నాలుగేళ్ల అబ్బాయి.
వంటిల్లు మహిళా సామ్రాజ్యం అంటారు. అయితే చెఫ్‌గా మహిళలు రాణించడం లేదు...
నిత్య: అవును. బహుశా రెస్టారెంట్స్‌లో ఉండే పని ఒత్తిడి, అధిక శారీరకశ్రమ కారణం కావచ్చు. నేను మాత్రం మంచి రెస్టారెంట్లో చెఫ్‌గా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.
పోటీలో ఏయే వంటలు ప్రదర్శించారు?
నిత్య: చెట్టినాడ్ చికెన్ గ్రేవీ-గూస్ బెర్రీ, చౌ చౌ చికెన్ ఓట్స్ సూప్, బ్రౌన్‌రైస్ బిసబేళ బాత్, అరటిపండు-బొప్పాయి- కొన్ని పప్పులు మేళవించిన సోయా-మల్టీ గ్రెయిన్ ఖీర్, లో కేలరీ చికెన్ ఐస్ స్టిక్స్ విత్ డిప్, కాజూ బట్టర్ మిల్క్-స్ప్రౌట్స్...
చాలా వరకు హెల్తీఫుడ్ అనుకుంటాను?
నిత్య: అవును. నా భర్త డాక్టర్ కావడంతో మా ఇంట్లో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వంటలే ఉంటాయి. మా వంటలు... రుచి తగ్గకుండా ఆరోగ్యం పెంచే పద్ధతిలో ఉంటాయి.
ఈ పోటీల్లో గెలవడానికి అది కూడా ఒక కారణం కావచ్చునా?
నిత్య: అవును.
దక్షిణాఫ్రికాలో డిసెంబరులో జరిగే ప్రపంచస్థాయి వంటల పోటీలో పాల్గొంటున్నారు... గెలుస్తాననుకుంటున్నారా?
నిత్య: తప్పకుండా. ఇది నాకు భారతీయవంటల మీద ఉన్న నమ్మకం. ఈ పోటీలో నేను కేవలం ఒక ప్రాంతానికి చెందిన వంటలే ప్రదర్శించాను. అక్కడ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వంటలనూ భాగం చేస్తాను. ఇండియన్ క్విజీన్కు ఉన్నంత వెరైటీ మరే దేశానికీ లేదు కాబట్టి గెలవగలననే అనుకుంటున్నా.
- ఎస్.సత్యబాబు