కొత్త సంవత్సరం... కొత్త భాష... కొత్త అభిమానులు!
పదిహేనేళ్లు.. యాభై తొమ్మిది సినిమాలు. కానీ, ఇప్పుడే కొత్తగా సినిమాల్లోకొచ్చిన అమ్మాయిలా ఇంకా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు త్రిష. మంచి పాత్రలొస్తే... మరో దశాబ్దం పాటు కథానాయికగా కొనసాగేలా ఉన్నారు. ‘‘కెరీర్‌వైజ్‌గా నేను ఇప్పటికీ సంతృప్తి పడడం లేదు. చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత అనే ఫీలింగ్ ఉంది. ‘ఇక చాలు.. ఫుల్‌గా శాటిస్ఫై అయిపోయాం. సినిమాలు మానేద్దాం’ అనే ఫీలింగ్ రాలేదు. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు త్రిష. పదిహేనేళ్లల్లో యాభై తొమ్మిది సినిమాలు చేసిన త్రిష తొలిసారి మలయాళంలో ఓ సినిమా అంగీకరించారు. సూపర్ హిట్ మూవీ ‘ప్రేమమ్’ కథానాయకుడు నివిన్ పాలీ సరసన ఆమె ఓ చిత్రంలో నటించనున్నారు. ఆల్రెడీ నివిన్ హీరోగా ‘ఇవిడె’, ‘ఇంగ్లిష్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
మామూలుగా మలయాళ సినిమాలంటే కథానాయికలకు కూడా కథలో ప్రాధాన్యం ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు దక్కుతాయి. ఇన్నేళ్లల్లో నటిగా తనను నిరూపించుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోని త్రిష ఈ తొలి మలయాళ చిత్రంలో శక్తిమంతమైన పాత్ర పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. సో... కొత్త సంవత్సరంలో కొత్త భాషలో కనిపించి, కొత్త అభిమానులను సొంతం చేసుకోనున్నారన్న మాట.