గంటన్నరలో ఢిల్లీ నుంచి ఆగ్రాకు..!
160 కి.మీ.ల వేగంతో పరుగులు తీసిన సూపర్‌ఫాస్ట్ రైలు
ఆగ్రా: ఢిల్లీ నుంచి ఆగ్రాకు 200 కి.మీ.లు. ఆ దూరాన్ని గంటకు 160 కి.మీ.ల వేగంతో ఒక సూపర్ ఫాస్ట్ రైలు 90 నిమిషాల్లో అధిగమించింది. భారతదేశంలో ఇదే రికార్డు స్పీడని రైల్వే అధికారులు ప్రకటించారు. 10 కోచ్‌లు, 2 జనరేటర్లతో ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ నుంచి గురువారం బయల్దేరిన ట్రైన్ గంటన్నరలో గమ్యం చేరిందన్నారు. దాంతో ఈ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని డివిజనల్ రైల్వే మేనేజర్ విజయ్ సెహగల్ వెల్లడించారు. అయితే, ఈ రూట్లో అక్టోబర్ నుంచి మాత్రమే ఈ సూపర్ రైలు పరుగులు తీస్తుందన్నారు. త్వరలో న్యూఢిల్లీ- చండీగఢ్, న్యూఢిల్లీ- కాన్పూర్‌ల మధ్య కూడా ఈ హైస్పీడ్ రైళ్లను రైల్వే శాఖ ప్రారంభించనుంది.