సూచీదే మయన్మార్ పీఠం
ఎన్ఎల్డీకి మెజారిటీ
యంగూన్: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ఉద్యమనేత, ప్రతిపక్ష ఎన్ఎల్డీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ అధికారికంగా విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటినుంచి సూచీ విజయం ఖాయమని తెలిసినా.. ఫలితాలు వెలువడిన తర్వాత అధికారికంగా ఆమె విజయం ఖరారైంది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం.. ఇంకా చాలా స్థానాల్లో ఫలితాలు వెలవడాల్సి ఉన్నప్పటికీ.. సూచీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ ఫిగర్ (348 సీట్లు)ను సాధించారు. వెల్లడైన ఫలితాల్లో 80 శాతం స్థానాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల మిలటరీ పాలనతో మోడువారిన మయన్మార్‌కు కొత్త వెలుగులు అందించేందుకు మరో అడుగు ముందుకు పడింది.
అధికార యూఎస్డీపీ దారుణంగా ఓడినా ప్రభుత్వ విషయాల్లో సైనిక అధికారాలు ఏమాత్రం తగ్గలేదు. ఆర్మీ జోక్యంతో తయారైన రాజ్యాంగం ద్వారానే సూచీ అధ్యక్షపీఠం ఎక్కే అవకాశం కోల్పోయారు. అయినా.. అంతకన్నా పెద్ద అధికారాలతో ప్రభుత్వాన్ని, పాలనను శాసిస్తానని సూచీ చెబుతున్నారు. కాగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా సంస్కరణలు తెచ్చిన మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్‌ను ప్రపంచం ప్రశంసించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు , కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సూచీని అభినందించారు.