ఈసారి బికినీ రౌండ్ ఉండదట!
ఫెమినా మిస్ ఇండియా పోటీలంటే అందులో పాల్గొనేవాళ్లతో పాటు చూసేవాళ్లు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఈ పోటీలతో యువతుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం, మొదటి మూడుస్థానాలు పొందినవారితో పాటు.. పోటీలో పాల్గొన్న అందరికీ కూడా మోడలింగ్ అవకాశాలు విస్తృతంగా రావడంతో వీటికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఈసారి ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా పోటీలలో మాత్రం ఆడిషన్ సమయంలో బికినీ రౌండ్ ఉండబోదని ప్రకటించారు. ఈ విషయాన్ని వాళ్లు తమ అధికారిక వెబ్సైట్లో తెలిపారు. సైట్లో పాల్గొనేవారికి అర్హతలను పేర్కొన్నప్పుడు.. అక్కడే ఈ సంగతి కూడా పేర్కొన్నారు.
పోటీలలో పాల్గొనేవాళ్లు 5 అడుగుల ఆరు అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ పొడవుతో ఉండాలని, అలాగే 2017 డిసెంబర్ 31 నాటికి 18-25 ఏళ్ల మధ్య వయసు కలిగినవారై ఉండాలని, పెళ్లి గానీ, నిశ్చితార్థం గానీ అయి ఉండకూడదని తెలిపారు. దాంతోపాటు భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉండాలని చెప్పారు. ఉద్యోగం, నివాసం, చదువు లేదా మరేదైనా అవసరాల కోసం దేశం వెలుపల ఆరు నెలలుగా ఉన్నవాళ్లు భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉంటే వాళ్లు కూడా అర్హులేనన్నారు. ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు కూడా భారతీయ పౌరులలాగే లెక్కలోకి వస్తారన్నారు. ఓసీఐ కార్డుదారులు టైటిల్ గెలుచుకోడానికి వీలుండదు గానీ, రెండు లేదా మూడోస్థానాలకు అర్హులని చెప్పారు. ఇతర అంతర్జాతీయ అందాల పోటీలకు కూడా అర్హులవుతారన్నారు. ఆడిషన్స్ సమయంలో జరిగే బికినీ రౌండ్ ఉండదన్నారు.