‘పిడికిళ్ల పోరు’లో యోధురాలు
ఆల్కాట్‌తోట: ఆమెలోని ఉక్కు సంకల్పంలాగే..పిన్నవయసులోనే ఆమె పిడికిలి రాటుదేలింది. ఆ గోదావరి బిడ్డ గోదాలో దిగితే తిరుగులేని యోధురాలినని చాటుతోంది. తన పిడిగుద్దుల వర్షంతో పతకాల పంట పండిస్తోంది. జాతీయంగానూ ఈ గడ్డ ఖ్యాతిని చాటాలన్న ధ్యేయంతో ఉన్న ఆమెకు.. దాన్ని సాకారం చేసుకోగల సిరి మాత్రం లేదు. సర్కారు సహకరిస్తేనే ఆమె స్వప్నం సత్యమవుతుంది. ఆ బాలికే రాజమహేంద్రవరానికి చెందిన షేక్ నస్రీన్.
నగరంలోని ఐఎల్టీడీ ప్రాంతానికి చెందిన నస్రీన్ తండ్రి షేక్ మస్తాన్ చిరువ్యాపారం చేస్తుంటారు. 2014లో హైదరాబాద్‌లోని బాబాయి ఇంటికి వెళ్లిన ఆమె.. అక్కడ తన ఈడులోనే వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారిని చూసి ఉత్తేజితురాలైంది. తానూ ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలన్న ఆలోచన అంకురించింది. అందుకు బాక్సింగ్‌ను ఎంచుకోవాలన్న నస్రీన్ ఆకాంక్షను బంధువులంతా తిరస్కరించారు. ఆడపిల్లకు క్రీడ ఎందుకని నిరుత్సాహపరిచారు.
అయితే ఆమె తండ్రి మస్తాన్, తల్లి మీరా మాత్రం కూతురి కోరికను మన్నించారు. దాంతో ఆమె హైదరాబాద్‌లో బాబాయి ఇంటి వద్దే ఉండి, 9వ తరగతి చదువుకుంటూ అక్కడి ఎల్బీ స్టేడియంలో శాప్ బాక్సింగ్ కోచ్ ఓంకార్ రాధా యాదవ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. రంగారెడ్డిలో జరిగిన జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీల్లో 54–56 వెయిట్ కేటగిరీలో గోల్డ్‌మెడల్ సాధించి, స్టేట్‌మీట్‌కు ఎంపికైంది. ఆ పోటీల్లోనూ తన పిడికిలి పట్టును చాటి, గోల్డ్‌మెడల్ సాధించింది. అనంతరం తెలంగాణలోని సరూర్‌నగర్‌లో జరిగిన జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది.
జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపు
శాప్‌లో నిర్వహించిన రాష్ట్ర రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌కూ నస్రీన్ అర్హత సాధించింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజమహేంద్రవరం తిరిగి వచ్చేసిన ఆమె ఇక్కడే పదో తరగతిలో చేరింది. వసతులూ, శిక్షణా దూరమైనా.. సాధనను కొనసాగిస్తూ కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ స్కూల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో అండర్–17 కేటగిరీ 62–66 కిలోల విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. పంజాబ్‌లో జరిగిన నేషనల్ మీట్‌కు ఎంపికైంది.అలాగే రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న డిస్ట్రిక్ట్ మీట్లో, విశాఖలో జరిగిన స్టేట్‌మీట్‌లో గోల్డ్‌మెడళ్లు సాధించింది. చెన్నైలో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొంది.
ప్రోత్సహిస్తేనే
రాష్ట్రంలో ఇతర క్రీడలతో పాటు బాక్సింగ్కూ ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా స్వశక్తితో పిడికిళ్లకు పదును పెట్టుకుంటున్న నస్రీన్.. ఇంటి వద్ద సాధన చేస్తూనే.. అమలాపురం వెళ్లి మధుకుమార్ అనే కోచ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. క్రీడారంగానికి దిగ్గజాల వంటి క్రీడాకారులెందరినో అందించిన ఘన చరిత్ర రాజమహేంద్రవరానికి ఉంది. అలాంటి నగరంలో బాక్సింగ్‌కు కనీసం శిక్షణా కేంద్రాలు లేకపోవడం క్రీడాకారిణిగా నస్రీన్ వికాసానికి విఘాతంగా పరిణించింది.
ప్రస్తుతం పదవతరగతి పాసైన నస్రీన్ కడప స్పోర్ట్స్ అకాడమీలోనైనా ఇంటర్లో సీటు లభిస్తే తన లక్ష్యం నెరవేరగలదని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జిల్లాస్థాయి అధికారులు తన ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తే అకాడమీలో స్థానం దక్కుతుందని చెపుతోంది. మరి.. ఈ క్రీడారత్నం మరింత రాణించి, ఈ గడ్డ ఖ్యాతి జాతీయ వేదికలపై మార్మోగేలా చేయడానికి.. సంబంధిత అధికారులు, క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని వేదికలపై ఆర్భాటంగా చెప్పే ప్రజాప్రతినిధులూ చేయూతనిస్తారో, లేదో చూడాలి.
జాతీయస్థాయిలో స్వర్ణపతకమే లక్ష్యం
జాతీయస్థాయిలో బాక్సింగ్‌లో రాణించి గోల్డ్‌మెడల్ సాధించడం నా లక్ష్యం. రాష్ట్రంలో సరైన సదుపాయాలు లేకపోవడం పాటవాన్ని పెంచుకోవడానికి ఆటంకంగా ఉంది. కోచింగ్ తీసుకోవాలన్నా వ్యయప్రయాసలతో కూడుకున్నది. నా తల్లిదండ్రులకు భారమైనా వారి ప్రోత్సాహంతోనే ఇంతవరకూ రాణించగలిగాను. ప్రభుత్వాధికారులు లేదా ఎవరైనా స్పాన్సరర్లు సహకరిస్తేనే నా లక్ష్యం నెరవేరుతుంది. –నస్రీన్