రెండేళ్లలో 102 మంది మృత్యువాత
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరా నిమిత్తం ట్రాన్స్‌కో సంస్థ జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు మనుషులు, జంతువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా పెద్ద ఎత్తున ప్రాణాలను బలిగొంటున్నాయి. జిల్లా ట్రాన్స్‌కో పరిధిలో ఐదు డివిజన్లుండగా, అనంతపురం డివిజన్లో 14,329, గుత్తి డివిజన్లో 11,640, హిందూపురం డివిజన్లో 8,688, కదిరి డివిజన్లో 9,025, కళ్యాణదుర్గం డివిజన్లో 10,045 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి గృహ, గృహేతర, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు సంస్థ విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటిలో 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు పట్టణాల్లో 7,862, పల్లెల్లో 30,589, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు పట్టణాల్లో 3,901, గ్రామీణ ప్రాంతాల్లో 11,975 ఉన్నాయి. వీటిలో చాలా భాగం జనావాసాల మధ్యనే ఉన్నాయి. వీటి సమీపంలోకి ప్రజలు, మూగ జీవాలు వెళ్లకుండా చుట్టూ కంచె వేసి జాగ్రత్తలు తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే, జిల్లా వ్యాప్తంగా వంద లోపు ట్రాన్స్ఫార్మర్లకు కూడా కంచె ఏర్పాటు చేయలేదని ఆ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. దీంతో ఇవి తరచూ ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలను బలిగొంటున్నాయి.
కాలానుగుణంగా చర్యలు
చేపట్టకపోవడమే ప్రమాదాలకు కారణం
ట్రాన్స్ఫార్మర్లు కొన్ని చోట్ల చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటి ఎత్తును పెంచాలంటే శ్రమతో కూడుకున్న పని కావడంతో ట్రాన్స్‌కో అధికారులు దృష్టి సారించడం లేదు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఏడు అడుగుల ఎత్తు వరకూ పిల్లర్‌ను ఏర్పాటు చేసి దానిపై ట్రాన్స్ఫార్మర్ను అమర్చాలి. అయితే ట్రాన్స్‌కో అధికారులు మాత్రం పట్టణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ల విషయంలో మాత్రం ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. పాత ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను కూల్చేసి వాటి స్థానంలో పిల్లర్లను ఏర్పాటు చేయడం లే దు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పిల్లర్ పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్న దాఖలాలు లేవు.
రెండేళ్లలో 137 ప్రమాదాలు
గడిచిన రెండేళ్లలో 102 మంది విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ట్రాన్స్‌కో నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలతో పాటు 35 పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. వీటిలో అధిక భాగం కంచెలేని ట్రాన్స్ఫార్మర్ల కారణంగా సంభవించినవేనని తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలు గాలిలో కలసిపోతున్నా తమకేమీ సంబంధం లేదన్న రీతిలో ట్రాన్స్‌కో అధికారులు వ్యవహరిస్తున్నారు. నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించడంలో సైతం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారుల తప్పిదం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు రుజువైతే నష్టపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. లక్ష, పశువులను నష్టపోతే వాటి విలువను లెక్కగట్టి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులను కోల్పోయిన 88 కుటుంబాలకు, పశువులను కోల్పోయిన 27 మంది యజమానులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. విద్యుత్ ప్రమాదం కారణంగానే మృతి చెందినట్లు బాధితులు తగిన రుజువులు సమర్పించకపోవడం వల్లే పరిహారం చెల్లించలేదని ట్రాన్స్‌కో అధికారులు సమాధానం చెబుతున్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
ట్రాన్స్ఫార్మర్ల కారణంగా జరిగే విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా, వాటి మన్నిక తక్కువగా ఉండడంతో కంచె స్థానంలో ట్రాన్స్ఫార్మర్లను 5 నుంచి 7 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా ఏర్పాటు చేసే ట్రాన్స్ఫార్మర్లను పిల్లర్లపై అమర్చుతున్నాం. జిల్లాలో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తెప్పించుకుని, రక్షణ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- రమణమూర్తి, ఎస్ఈ, ట్రాన్స్‌కో, అనంతపురం.