రావాణాయేతర వాహనాలకూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్
ఏలూరు అర్బన్: రోడ్డు రవాణా కార్యాలయంలో ఇక నుంచి నో ఫుట్‌ఫాల్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎస్ఎస్ మూర్తి తెలిపారు. నగరంలోని రోడ్డు రవాణా కార్యాలయంలో శనివారం వాహనాల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకూ రవాణా వాహనాలను ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించామని, ఇకపై రవాణేతర వాహనాలను కూడా ఈ విధానంలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో జాప్యాన్ని నివారించడం, అధికారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించే లక్ష్యంతో ఆన్లైన్ రిజిస్ట్రేసన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. వాహనాల డీలర్లు, అమ్మకందారులు వాహనాన్ని విక్రయించిన సమయంలోనే టెంపరరీ రిజిస్ట్రేషన్ జనరేట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్టీవో కార్యాలయంలో సదరు అప్లికేషన్ అప్రూవల్ చేసి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ జనరేట్ అవుతుందని చెప్పారు. వాహనదారుడు ఆర్టీఏ కార్యాలయానికి రాకుండానే టీఆర్, పీఆర్, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇంటి వద్దే అందుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇకపై డీలర్లు, అమ్మకందారులు రవాణేతర వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఆన్లైన్లో జరపాలని ఆయన సూచించారు.