no funds
-
పైసల్లేవ్..!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలో ఆసరా లబ్ధిదారులను నగదు కొరత వెంటాడుతోంది. సరిపడా నగదు లేకపోవడంతో ఈనెల ఇంకా చాలా మందికి పింఛన్లు అందలేదు. దీంతో లబ్ధిదారులు పింఛన్ ఎప్పుడుస్తుందోనని ఆశగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. గతంలో ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకులు ‘ఆసరా’ పథకం ద్వారా కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. అయితే, గతంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేసేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా బ్యాంకుల్లో కొరత కారణంగా లబ్ధిదారులకు అందడం లేదు. దీంతో వారు ఆయోమయంలో పడిపోయారు. ఇప్పటికి లబ్ధిదారులకు నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ అందాల్సి ఉంది. పది రోజుల పాటు ప్రతి నెలా 22వ తేదీ నుంచి మరుసటి నెల 2వ తేదీ వరకు పింఛన్లు అందజేయాలి. కానీ రిజర్వ్ బ్యాంకు నుంచి సరిపడా నగదు రాకపోవడంతో స్థానిక బ్యాంకుల్లో కొరత ఏర్పడింది. ప్రతీ నెల పింఛన్ల పంపిణీ కోసం రూ.22.29 కోట్లు అవసరం. కానీ ఇందులో నవంబర్ నెలకు చెందిన రూ.22.29 కోట్లలో రూ.11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా మిగతా రూ.11.29 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అలాగే, డిసెంబర్ నెలకు సం బంధించి మొత్తం అందాలి. ప్రతీనెలా ఆర్బీఐ నుంచి జిల్లా లోని ఎస్బీఐ మదర్ బ్యాం కుకు పింఛన్ డబ్బు చేరుతుంది. ఇందులో వచ్చే నెల కోసం కొంత నగదు నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి రిజర్వ్ బ్యాంకు జిల్లాకు కేవలం రూ.11 కోట్లే ఇవ్వడంతో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. అయి తే, చెల్లించాల్సిన మొత్తం ఇంకా ఉండడంతో లబ్ధిదారులు ప్రతీరోజూ బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరిగి వెళ్తున్నారు. లబ్ధిదారులు గాబరా పడొద్దు.. బ్యాంకుల్లో నగదు కొరత వల్ల ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. అంతే తప్ప ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదు. అవుతుంది. ఈ మేరకు ఆసరా లబ్ధిదారులు గాబరా పడొద్దు. ప్రతిరోజు కొన్నికొన్ని డబ్బులు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తాం. – శారద, ఆసరా ఏపీఓ -
ఖజానా ఖాళీ.. చెల్లింపులకు కటకట
► 15 రోజులుగా అన్ని పద్దుల బిల్లుల చెల్లింపునకు లాక్ ► నేడు ఆర్థికసంవత్సరం ఆఖరి రోజు ► సంక్షేమానికి పడిన బ్రేక్ ఫిబ్రవరి జీతాల బిల్లులకు మినహాయింపు ట్రెజరీ ద్వారా అన్ని రకాల బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ బిల్లుల చెల్లింపులపై ప్రతిçష్టంభన కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఇప్పటిదాకా రూ.50 కోట్లపైనే బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. విద్యార్థుల స్కాలర్షిప్పులు, మధ్యాహ్న భోజన పథకం, ఉద్యోగుల టీఏ బిల్లులు, ఎర్న్డ్ లీవ్‌లు, జీపీఎఫ్, టీఏ, డీఏలు, అరియర్స్ క్లెయిమ్స్, విద్యుత్, టెలిఫోన్ వంటి కంటెజెన్సీ బిల్లులు, రుణాలు ఆగిపోయిన వాటిలో ఉన్నాయి. ముద్దనూరు/ కడప సెవెన్‌రోడ్స్ : మీ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ట్రెజరీకి పంపండి, ఈ ఆర్థిక సంవత్సరంలో బిల్లులు పెండింగ్ లేకుండా చూసుకోండి అని ప్రస్తుత టీడీపీ సర్కారు రాకముందు అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందేవి. అయితే గత మూడు సంవత్సరాల నుంచి పద్ధతి మారింది. బిల్లులన్నింటినీ సిద్ధం చేసి ఖజానా కార్యాలయంలో అందించి 15 రోజులు గడుస్తున్నా చెల్లింపుల మాటే ఎత్తడం లేదు. శుక్రవారంతో ఆర్థికసంవత్సరం ముగుస్తున్నా బిల్లుల చెల్లింపునకు అడుగు ముందుకు పడటం లేదు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం ట్రెజరీలకు బిల్లుల చెల్లింపులను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కటకట నెలకొంది. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో బడ్జెట్ చెల్లింపునకు అనుమతులు (బిల్లులకు పాస్ఆర్డర్) లభించకపోవడంతో అన్నిరకాల చెల్లింపులు ఆగిపోయాయి. ఉపకార వేతనాలు లేవు: కనీసం విద్యార్థుల ఉపకార వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు రూ.20కోట్ల ఉపకారవేతనాల చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్పులకు బడ్జెట్ ఉందని, ఇందుకు ఎలాంటి అవరోధాలు కల్పించబోమని ప్రభుత్వం పదేపదే చెబుతుండడం తెలిసిందే. కాగా ప్రస్తుత ఫ్రీజింగ్ వల్ల వాటికి బ్రేక్ పడడంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఫీజు చెల్లింపులు కూడా ఆగిపోయాయి. ఇవి కాక పంచాయతీల జనరల్ ఫండ్, కనీసం కర్మకాండలకు చెల్లించే బిల్లులకు సైతం మోక్షం లభించలేదు. ఈనెల 15వ తేదీ తర్వాత ట్రెజరీలకు చేరిన కొందరి జీతాల బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. అత్యవసర బిల్లులపైనా బ్యాన్: జిల్లాలో 12 ఉపఖజానా, జిల్లా ఖజానా కార్యాలయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన బిల్లులన్నింటినీ చెల్లించాల్సి ఉంది. దీనికి వివిధ రకాల పద్దుల ద్వారా చెల్లింపులు చేపడతారు. అత్యవసరమైన బిల్లులకు క్రమపద్ధతిలో బిల్లుల చెల్లింపునకు అనుమతులు మంజూరవుతాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 15వ తేదీనుంచే బిల్లుల చెల్లింపుపై బ్యాన్ వుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికి సుమారు రూ.50 కోట్ల పైచిలుకు బిల్లుల చెల్లింపులకు అనుమతులు లభించక ట్రెజరీల్లోనే ఆగిపోయినట్లు అధికారిక సమాచారం. గత 15రోజులనుంచి బిల్లులు అందకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతున్నారు. జీతాల బిల్లులు ఓకే: ఫిబ్రవరికి సంబంధించి ఉద్యోగుల జీతాల బిల్లులకు మాత్రం ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇక సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు బియ్యం, పప్పు, కూరగాయలు, గుడ్లు, పండ్లు, కాస్మోటిక్స్ తదితర వాటికి ఇచ్చే డైట్ చార్జీలు సైతం నిలిపివేశారు. జిల్లాలో మధ్యాహ్నం భోజన పథకాన్ని నిర్వహిస్తున్న ఏజెన్సీలకు ఆరు నెలలుగా జీతాలు, అలాగే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో తెలియకపోవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. నేటి అర్ధరాత్రి వరకు పనిచేస్తాం: బిల్లుల చెల్లింపునకు అనుమతులు నిలిచిపోయిన మాట వాస్తవమే. శుక్రవారం ఆర్థిక సంవత్సరం చివరి రోజు. అనుమతి వచ్చిన బిల్లుల చెల్లింపునకు శుక్రవారం అర్ధరాత్రి వరకు పనిచేయాలని ఆదేశాలున్నాయి. ---సత్యవతి, డీడీ జిల్లా ట్రెజరీస్ -
నిధులు లేవు.. పనులు ఎలా చేయాలి?
గ్రామసభలో సర్పంచ్ ఆవేదన అల్లాదుర్గం: ‘గ్రామ పంచాయతీలకు నిధులు రావడం లేదు. గ్రామసభలు పెడితే ప్రజలు అడుగుతున్నారు. రూపాయి లేకుండా విద్యుత్ బిల్లుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను తీసుకుంది. గ్రామంలో పనులు ఎలా చేయాలి’ అని అల్లాదుర్గం మండలం పల్వట్ల సర్పంచ్ ఆడిగే ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పల్వట్లలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తామని, గతంలో గ్రామజ్యోతి ద్వారా పనులు వివరాలు, తీర్మానాలు తీసుకున్న ప్రభుత్వం నిధులను మాత్రం మంజూరు చేయలేదన్నారు. పంచాయతీలో నిధులు లేక కనీసం మురికి కాల్వలను తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు మాత్రం సమావేశాలు పెట్టి పారుశుద్ధ్యం పనులు చేయాలని చెబుతున్నారని, నిధులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంజ్రేకర్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసిన సీఎం
జిల్లాపరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వీర్యం చేశారని జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక దర్గామిట్ట జెడ్పీ కార్యాలయంలో పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు చైర్మన్‌గా రెండేళ్ల పాలన పూర్తికావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, పన్నులు రాకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివద్ధి జరగలేదన్నారు. తమకున్న నిధుల్లోనే ప్రజల అవసరాలను తీర్చేందుకు శక్తి మేరకు కషి చేస్తున్నామన్నారు. కొన్నేళ్లుగా ఆయా పాఠశాలల్లో మరమ్మతులకు గురైన వేలాది కంప్యూటర్లను రిపేర్ చేయించామన్నారు. పాఠశాలకు ఇన్స్ట్రక్టర్లను నియమించి కంప్యూటర్ విద్యాబోధనను పునరుద్ధరింపజేస్తామని తెలిపారు. ఈ ఏడాది 8, 9 తరగతులకు మార్గదర్శి ప్రత్యేక మెటీరియల్‌ను అందజేస్తామన్నారు. ఇంటర్ విద్యపై ఉద్యమం కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌ను రద్దు చేయాలని చైర్మన్ డిమాండ్ చేశారు. పాఠశాల స్థాయిలోనే 11, 12 తరగతుల విద్యావిధానాన్ని అమలు చేయాలన్నారు. సీడ్ (సెకండరీ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ డిజైన్) ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామన్నారు. చైర్మన్ పదవితో నిమిత్తం లేకుండా ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రక్షాళనకు ఉద్యమించడం ఏకైక లక్ష్యమన్నారు. జెడ్పీటీసీలకు ప్రాధాన్యతనివ్వడంలేదని వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. పుట్టినరోజు సందర్భంగా చైర్మన్ కేక్ కట్చే శారు. జెడ్పీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. చైర్మన్‌గా మొదటి తనకు సంతప్తినిచ్చిందన్నారు. రెండో సంవత్సరం ఆశించిన స్థాయిలో అభివద్ధి పనులు జరగలేదని దీనికి కారణం ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.రామిరెడ్డి, ఇన్చార్జ్ ఏఓ వసుమతి, సిబ్బంది పాల్గొన్నారు. -
విశాఖ మెట్రోఆశలపై నీళ్లు
-
నల్లొండ జిల్లాలో మంత్రి తలసాని పర్యటన
నల్లగొండ: జిల్లాలో పశుసంవర్థక శాఖ పనితీరు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. పశుసంపదను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేయాల్సిన ఈ శాఖకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ శాఖలో అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది కొరత.. నిధులు లేకపోవడం, ఆస్పత్రుల్లో మందులలేమి లాంటి సమస్యలున్నాయి. గత ఏడాది పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గడ్డి అంచనాలను ముందస్తుగా పంపడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు కరువు మండలాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా గడ్డి కొరత వేధిస్తోంది. పశువులు తినేందుకు గడ్డి లేక, మందులు లేక, సిబ్బంది లేక, పర్యవేక్షించాల్సిన అధికారులూ లేక పశుసంవర్థక శాఖ నామమాత్రంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బుధవారం జిల్లాకు రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు జిల్లా కేంద్రంలో పశుసంవర్థక , మత్స్య శాఖల అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. వాస్తవానికి జిల్లాలో పశుసంపద గణనీయంగా ఉంది. తెల్లజాతి పశువులు 5లక్షల వరకు ఉండగా, నల్లజాతి పశువులు 8లక్షల వరకు ఉన్నాయి. గొర్రెలు, మేకలు కలిపి 25లక్షల వరకు ఉంటాయని అంచనా. అదే విధంగా జిల్లాలో 92లక్షల కోళ్లు కూడా ఉన్నాయి. అయితే, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ) కింద జిల్లాలో గొర్రెల యూనిట్లకు గాను రుణం ఇస్తారు. అందులో 60శాతం బ్యాంకులోను కాగా, 20 శాతం సబ్సిడీ, మరో 20 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 2250 మంది లబ్ధిదారులను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. వీరికి సబ్సిడీ కింద రూ.10 కోట్ల వరకు రావాల్సి ఉంది. కానీ, 2015-16 సంవత్సరానికి సంబంధించి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే, ఈ నిధులు కేంద్రం ఇవ్వాలంటే రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటును చెల్లించాల్సి ఉంటుందని, రాష్ట్రం చెల్లించకపోవడంతోనే కేంద్రం నిధులు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో పాటు ప్రణాళిక పథకాల కింద గొర్రెల కొనుగోలుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అమలు చేసే పథకం కూడా ఇంతవరకు గ్రౌండింగ్ కాలేదు. ఈ పథకం కింద మొత్తం 26.50 లక్షల రూపాయలు అవసరం కాగా, గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు క్వార్టర్లకు సంబంధించి రూ. 12.56 లక్షలు మాత్రమే విడుదల చేశారు. ఆ నిధులతో మొత్తం 179 యూనిట్లకు గాను కేవలం 83 మాత్రమే గ్రౌండింగ్ చేశారని లెక్కలు చెబుతున్నాయి. పోస్టులు ఖాళీ.. ఇక,పశుసంవర్థక శాఖలో చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల నుంచి పనిచేయాల్సిన సిబ్బంది వరకు ఖాళీలే కనిపిస్తున్నాయి. ఆ శాఖ లెక్కల ప్రకారమే జిల్లాలో 1 డిప్యూటీ డెరైక్టర్, 9 అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (26), లైవ్‌స్టాక్ ఆఫీసర్ (3), జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ (26), వెటర్నరీ అసిస్టెంట్ (84), అటెండర్లు (71) పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆంధ్రకు వెళ్లిపోయిన అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టులను కూడా ఇంతవరకు భర్తీ చేయలేదని తెలుస్తోంది. జబ్బు చేస్తే మందుల్లేవు.. తినడానికి గడ్డి లేదు ఇక, జిల్లాలో ఉన్న పశుసంపదకు జబ్బు చేస్తే మందులు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో పశువైద్యశాలలున్నాయి. అదే వైద్య శాఖ పరిధిలోని ఆస్పత్రులకు మందుల కోసం రూ.1.50లక్ష వరకు సొంతంగానే ఖర్చు చేసే అవకాశం ఉండడం.. పశువుల ఆస్పత్రులకు మాత్రం మందులు సరఫరా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మందులు కొనుక్కోవాల్సి వస్తోందని పశువుల యజమానులు వాపోతున్నారు. మరోవైపు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగానే గడ్డి కొరత లేకుండా చూసుకోవాల్సిన అధికారులు అంచనాలను ఆలస్యంగా గ్రహించడంతో దాదాపు లక్ష టన్నుల కొరత ఏర్పడింది. ఒక్క కరువు మండలాల్లోనే 52వేల మెట్రిక్ టన్నుల గడ్డి కొరత ఉందని అంచనా. మిగిలిన మండలాల్లో మరో 30వేలు కలిపి మొత్తం 82వేల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. కరువు మండలాల్లో పశు సంపద కోసం మొత్తం రూ.4కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనాలు పంపినా ఇంతవరకు ఆ నిధులు కూడా రానట్టు తెలుస్తోంది. మరమ్మతులకూ డబ్బుల్లేవు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పశువులు నీరు తాగేందుకు గాను 1189 నీటితొట్లున్నాయి. మరో 870 తొట్లను మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే, అందుకు గాను నిధులు లేకపోవడంతో వాటికి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి. ఇక, జిల్లాలో కొత్తగా మరో 2,656 తొట్లు నిర్మించాలని కలెక్టర్ నిర్ణయించగా, వీటి నిర్మాణ బాధ్యతలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. ఇక, గొర్రెల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడంతో పాటు వాటి బరువును పెంచేందుకు గాను ఏటా మూడుసార్లు నట్టల నివారణ మందు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. మంత్రి తలసాని చొరవ తీసుకుని అవసరమైన నిధులు మంజూరు చేయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, పశువులకు మందులు సకాలంలో సరఫరా చేయాలనిప్రజలుకోరుతున్నారు. -
'నిధుల్లేకుండా ప్రాజెక్టులెలా పూర్తి చేస్తారు..'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగా పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారు, ఇప్పుడేమో ప్యాకేజీ ఇస్తామంటున్నారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి పోలవరం కోసం పోరాడుతోందని పునరుద్ఘాటించారు. నిధులు కేటాయించకుండా హంద్రీ-నీవా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని మిధున్ రెడ్డి అన్నారు. -
నిధులివ్వరు... నీళ్లూ ఇవ్వరు
ప్రాధాన్యతా ప్రాజెక్టులకూ కేటాయింపులు అంతంతే అందులో రాయలసీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అరకొరే.. వేగంగా పూర్తి చేస్తామంటూ సర్కారు కబుర్లు.. అందరూ వద్దంటున్నా పట్టిసీమపై ప్రేమ.. బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ఊసే లేని వైనం ఇతర ప్రాజెక్టుల కేటాయింపుల్లో కోతపెట్టి.. దీనికి వెచ్చించే అవకాశం! అన్ని ఏర్పాట్లు చేస్తే, కుళాయి తిప్పిన వెంటనే నీళ్లొస్తాయి. మరి నీళ్లిచ్చిన ఘనత దాన్ని తిప్పిన వారిదే అవుతుందా? అందులో నీళ్లు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన వారికి చెందుతుందా? హంద్రీ-నీవాలో మోటార్లు ఆన్ చేసిన తనకే అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత దక్కుతుందని చెప్పుకుంటున్న చంద్రబాబు బండారం ఇదీ.. ఆ ప్రాజెక్టు పనులు ఎవరి హయాంలో పూర్తయ్యాయనే విషయాన్ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టే కాదు.. జలయజ్ఞం కింద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి, వేగంగా పనులు చేసి ముగింపు దశకు చేర్చిన ప్రాజెక్టుల్లో.. తోటపల్లి బ్యారేజ్, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వంశధార రెండోదశ, వెలిగొండలను ఇప్పుడు బాబు ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద చేపట్టి.. వాటి ఘనత తనదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అందరూ వ్యతిరేకిస్తున్న పట్టిసీమ లిఫ్ట్‌ను కూడా ఆ జాబితాలోనే చేర్చింది. అయితే ఇలా గుర్తించిన వాటినీ వేగంగా పూర్తి చేయడానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఆయా ప్రాజెక్టులవారీగా పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది. ఆ వివరాలివీ.. అందరూ వ్యతిరేకిస్తున్నా పట్టిసీమపై పట్టు.. గోదావరిపై పట్టిసీమ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి పోలవరం కుడికాల్వకు 80 టీఎంసీల నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల గోదావరి డెల్టా బీడుబారుతుందని, కృష్ణా డెల్టాకు నీరందే గ్యారంటీ లేదని, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు వాటా కోరితే.. కృష్ణా నికరజలాల్ని కోల్పోవాల్సి వస్తుందని టీడీపీ మినహా వివిధ పార్టీలు, ప్రజలు, రైతుసంఘాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిపట్టుదలతో ముందుకెళుతోంది. ప్రాజెక్టు చేపట్టడానికి రూ.1,300 కోట్ల పరిపాలనా అనుమతులిచ్చి ప్రారంభోత్సవమూ చేసింది. ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్టు పేరే లేదు. అంటే రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులకు కోత పెట్టి, దీనికి ఖర్చు చేస్తారనే అనుమానం అధికారుల్లో ఉంది. ప్రజలు కోరుకుంటున్న ప్రాజెక్టులకుగాక, కాసుల కక్కుర్తితో చంద్రబాబు కోరుకుంటున్న ప్రాజెక్టుకు నిధులు ఖర్చుచేసి పూర్తి చేస్తే రాష్ట్రానికి లాభంకంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే ఆందోళన నెలకొంది. తోటపల్లి బ్యారేజ్-నిధుల కేటాయింపు అంతంతే.. తోటపల్లి బ్యారేజ్ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.84 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటికోసం 42 చెరువులను నింపడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించిన దీనికి చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో ఖర్చుచేసింది రూ.3 కోట్లే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.399 కోట్లు వ్యయం చేశారు. తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేశాయి. 2014 మార్చి 31 వరకు రూ.609.61 కోట్లు ఖర్చుపెట్టి 80 శాతం పనులు పూర్తి చేశారు. తాజాగా బాబు అధికారంలోకి వచ్చాక 2014-15 ఆర్థిక సంవత్సరంలో(2015 ఫిబ్రవరి వరకు) రూ.12 కోట్లు ఖర్చుపెట్టారు. సవరించిన అంచనాలప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.774.9 కోట్లు. భూసేకరణ ఇంకా పూర్తవలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు రూ.162 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టర్లకు ధరల పెంపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో.. ఈ ఏడాది కేటాయించిన నిధులు వారికి చెల్లించడానికి సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 20 శాతం పనులు, భూసేకరణ పూర్తి చేయడానికీ ఈ ఏడాది నిధులిస్తే... 1.84 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని, కానీ నిధుల కేటాయింపు అంతంతేనని అంటున్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి- బడ్జెట్లో ఇచ్చింది రూ.200 కోట్లే! దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతమున్న అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరివ్వడంతోపాటు రెండోదశలో చిత్తూరు జిల్లాకూ నీరివ్వడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,850 కోట్లు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లలో చేసిన ఖర్చు రూ.13 కోట్లే. వైఎస్ హయాంలో అనంతపురం జిల్లాకు ఎంత ఖర్చయినా నీళ్లివ్వాలనే లక్ష్యంతో రూ.4,340 కోట్లు ఖర్చుపెట్టి తొలిదశను ముగింపునకు తెచ్చారు. తర్వాత ప్రభుత్వాలు రూ.2,143 కోట్లు ఖర్చు చేశాయి. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే.. హంద్రీ-నీవా ద్వారా అనంతపురం జిల్లాకు కొంతమేర నీళ్లిచ్చారు. కాలువల్లో చిన్న పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే.. మరింతగా నీటిని తరలించడానికి అవకాశముండేది. కానీ దీన్ని సర్కారు వినియోగించుకోలేదు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన మేరకు నీళ్లివ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసినపని కేవలం పంపులు ఆన్ చేయడమే. కానీ అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత తనదిగా చెప్పుకుంటున్న బాబు తీరును చూసి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు నవ్వుతున్నారు. హంద్రీ-నీవా పూర్తికి రూ.1,100 కోట్లు అవసరమని, ఆ మేరకు నిధులిచ్చి తానే పూర్తిచేశానని చెప్పుకోవడానికి వీలున్నా.. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది రూ.200 కోట్లేనని పేర్కొంటున్నారు. అది కూడా కాంట్రాక్టర్లు రెండేళ్లుగా చేసిన పనులకు అధిక ధర చెల్లించడానికే సరిపోతాయంటున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి- అరకొర కేటాయింపు రాయలసీమను సస్యశ్యామలంగా మార్చడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు బాబు హయాంలో చేసిన ఖర్చు రూ.17 కోట్లే. వైఎస్ హయాంలో గాలేరు-నగరికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఉన్నంతకాలం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగింది. మహానేత మరణాంతరం వచ్చిన పాలకులు ఈ ప్రాజెక్టును చిన్నచూపు చూపడంతో నిర్మాణం అటకెక్కింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7,216.45 కోట్లు. వైఎస్ హయాంలో దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు. తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు, తాజాగా బాబు అధికారంలో ఉన్న 11 నెలల్లో.. మొత్తం కలపి చేసిన వ్యయం రూ.330 కోట్లే. ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు రూ.169.58 కోట్లు. ఇంత తక్కువ కేటాయింపులు జరిగితే.. ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవాల్సిందేనని అధికారులంటున్నారు. మొత్తం పనులన్నీ పూర్తయితే శ్రీశైలం బ్యాక్షోర్ నుంచి 38 టీఎంసీల వరద నీటిని ఏటా ఆగస్టు, నవంబర్ నెలల మధ్య తరలించి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.90 లక్షల ఎకరాలకు నీరివ్వచ్చు. వంశధార ప్రాజెక్టు రెండోదశ - పూర్తయ్యేది ఎప్పుడు? వంశధార రెండోదశ కింద రెండు ఫేజ్‌లు ఉన్నా యి. తొలి ఫేజ్ అంచనా వ్యయం రూ.209 కోట్లు, మలి దశ అంచనా వ్యయం రూ.933 కోట్లు. బాబు తొమ్మిదేళ్ల పాలన లో రూ.44.26 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్ కలల ప్రాజెక్టుగా దీన్ని చేపట్టి తన హయాంలో రూ.657 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ ప్రగతికి వేగం అందించారు. తర్వాత ప్రభుత్వాలు రూ.138.96 కోట్లు ఖర్చు చేశాయి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది రూ.63 కోట్లే. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించినా.. తగినన్ని నిధులివ్వకపోవడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేదానిపై ఉత్తరకోస్తా ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు- ప్రభుత్వంలో చలనమేదీ? ఈ ప్రాజెక్టును పూర్తిచేయడంద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడం, దుర్భిక్ష, ఫ్లోరైడ్ ప్రభావిత 30 మండలాల్లోని 15 లక్షలమందికి తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యం. చంద్రబాబు గత పాలనాకాలంలో రూ.13 కోట్లు కేటాయించారు. కానీ అది కూడా ఖర్చుపెట్టలేదు. ప్రాజెక్టు శంకుస్థాపనకు శిలాఫలకం వేయడానికిమాత్రం రూ.10 లక్షలు ఖర్చుచేశారు. తర్వాత అధికారం చేపట్టిన వైఎస్సార్ రూ.4,785 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2005 డిసెంబర్ 28న సైట్ క్లియరెన్స్, 31-3-2006న పర్యావరణ అనుమతి, 30-9-09న స్టేజ్-1 అటవీ అనుమతి లభించాయి. ఇప్పటివరకు సుమారు రూ.3,674 కోట్లు ఖర్చుచేశారు. తాజా అంచనాలప్రకారం ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. ఈ ఏడాది బడ్జెట్లో కనీసం రూ.550 కోట్లు కేటాయించాలంటూ జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఇచ్చింది రూ.153.89 కోట్లే. ఇంకా 6,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి తాజా చట్టాన్ని తమకు వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కనీస చర్యలూ చేపట్టట్లేదు. ఇటీవల టన్నెల్ బోరింగ్ మెషీన్(సొరంగం తవ్వే యంత్రం)లకు సంబంధించి కొత్త సమస్య లేవనెత్తారు. లోపల నల్లరాయి పడిందని, తద్వారా బ్లేడ్లు విరిగిపోతూ పనులు మందకొడిగా సాగుతున్నాయని, దీనివల్ల తమకు వ్యయం పెరుగుతుందంటూ కాంట్రాక్టర్ వెనుకంజ వేశారు. డాలర్ రేటు పెరగడం, కరెంటు యూనిట్ కాస్ట్ కూడా ఇటీవలికాలంలో పెరిగినందున.. వాటికీ అదనంగా నిధులివ్వకపోతే పనులు చేయలేమంటూ చేతులెత్తేశారు. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపట్లేదు. -
ధూపం దీపం శూన్యం!
దేవాదాయ శాఖ సర్వశ్రేయో నిధి దాదాపు ఖాళీ పురాతన ఆలయ జీర్ణోద్ధరణను పణంగా పెట్టి పుష్కర పనులు ధూప దీప నైవేద్య నిధులు ‘తెలంగాణ మొక్కుల’కు సరి పేద ఆలయాలను కలవర పెడుతున్న సర్కారు వైఖరి ఇక దళిత వాడల్లో ఆలయాల నిర్మాణానికీ ఆటంకాలే తెలంగాణలోని ప్రధాన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలన్న నిర్ణయంతో అభినందనలు అందుకుంటున్న ప్రభుత్వం.. పురాతన ఆలయాలు, ఆదాయం లేని చిన్న గుడుల విషయంలో వింతగా వ్యవహరిస్తోంది. ఇలాంటి దేవాలయాలకు ఆయువు పట్టయిన దేవాదాయ శాఖలోని సర్వశ్రేయో నిధిని అడ్డదారిలో కొల్లగొట్టేస్తోంది. కాసులు లేక నీరసంగా ఉండే ఆ నిధి కాస్తా సర్కారు దెబ్బతో ఖాళీ అవుతోంది. వీటిపైనే ఆధారపడ్డ వేల ఆలయాల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సర్వశ్రేయో నిధి పరిధిలోకి రాని పనులకు కూడా ఈ నిధులు దానం చేస్తూ చిన్న ఆలయాలను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. మొక్కులకూ ఇవే నిధులు తెలంగాణ సిద్ధిస్తే రెండు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలకు మొక్కులు మొక్కినట్టు సీఎం స్వయంగా వెల్లడించారు. తిరుపతి వెంకన్నకు సాలిగ్రామ హారం, ఇంద్రకీలాద్రి కనకదుర్గ, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, కొరివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయించేందుకు రూ. 5.59 కోట్లు అవసరమవుతాయని లెక్కలేసి దాన్నీ సర్వశ్రేయో నిధి ఖాతాలోకే వేసేసింది. పుష్కర పనులు, మొక్కులకు వెరసి రూ. 18.59 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సర్వశ్రేయోనిధిలో రూ. 28 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఖర్చు చేసిన మొత్తం తీసేస్తే మిగిలేది రూ. 9 కోట్లే. గాలిలో దీపంలా.. దేవాలయాలకు అతి ముఖ్యమైన ధూప దీప నైవేద్యాలకు ప్రస్తుతం రూ.2,500 చొప్పున చెల్లిస్తున్న మొత్తాన్ని రూ. 6 వేలకు పెంచుతున్నట్టు ఇటీవల సీఎం ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇందుకు రూ.13 కోట్లు కావాలి. జీర్ణోద్ధరణకు సంబంధించి పెండింగ్ బిల్లులే రూ.3 కోట్ల మేర పేరుకుపోయాయి. ఇక దళితవాడల్లో దేవాలయాలకు సంబంధించి రూ. 50 కోట్ల పనులు జరపాల్సి ఉంది. వీటన్నింటికి ఇప్పుడు నిధులెక్కడి నుంచి ఇస్తారో తెలి యని గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో దేవాలయాల ఆదాయం నుంచి కామన్ గుడ్ ఫండ్‌కు రూ.9 కోట్ల లోపు నిధులు మాత్రమే జమ కానున్నాయి. సాధారణంగా దీనికి ప్రభుత్వం నిధులిచ్చే ఆనవాయితీ లేదు. వెరసి అసలు పనులను పణంగా పెట్టి దాని నిధులను వేరే పనులకు ప్రభుత్వం మళ్లిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించాల్సిందిగా దేవాదాయ శాఖ ఆర్థికమంత్రికి ప్రతిపాదనలు అందజేసింది. వీటిని ఇస్తే సమస్యే ఉండదు. అయితే.. అన్ని నిధులు దేవాదాయ శాఖకు ఇచ్చే ఉదారతే ఉంటే.. అసలు సర్వశ్రేయో నిధిని మళ్లించే పరిస్థితి వచ్చేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే ధూప దీప నైవేద్యాలకు కొన్ని నిధులు మంజూరై అక్కడ పూజలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండా ప్రభుత్వం మళ్లీ ‘పేద ఆలయాల’ను కలవరపెడుతోంది. ఇదీ సంగతి.. దేవాదాయ శాఖలో సర్వశ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్) పేరుతో ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఉంది. ఆదాయం లేని గుడుల్లో ధూపదీప నైవేద్యాలకు ప్రతినెలా రూ.2,500 చొప్పున సాయం చేయడం, శిథిల ఆలయాలను గుర్తించి బాగు చేయ టం, దళితవాడల్లో గుడుల నిర్మాణం దీని విధి. ఈ పరిధిలోకి రాని పనులకు నయా పైసా ఖర్చు చేయరాదు. కానీ ప్రభుత్వం దేవుడి పేరుతో జరిగే పనులనూ దీనికే అంటగడుతోంది. ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల సమస్య ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు ఖజానాపై అదనపు భారం లేకుండా చూసుకుంటోంది. ఖజానాను రక్షించుకునే క్రమంలో దేవుడి నిధికే ఎసరు పెట్టేసింది. ఈ ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకు గోదావరి తీరంలో ఉండే ఆలయాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం సొంతగా నిధులు ఇవ్వాల్సి ఉండగా.. అవి దేవుడి పనులే అయినందున దాన్నీ సర్వశ్రేయో నిధి ఖాతాలో జమ కట్టేసింది. అందుకోసం రూ.13 కోట్లను దాని నుంచే ఖర్చు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో దీపం మిణుకుమిణుకుమంటోంది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణను, ధూపదీప నైవేద్యాలను పణంగా పెట్టి పేద దేవాలయాల నిధులను సర్కారు దొడ్డిదారిన పుష్కరాల పనులకు మళ్లిస్తోంది. ఖజానాపై భారాన్ని వదిలించుకునేందుకు మొత్తంగా దేవుడి నిధికే ఎసరుపెట్టింది. దీంతో దేవాదాయ శాఖ సర్వశ్రేయోనిధి దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ పరిణామంతో అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న పేద దేవాలయాలకు ఆసరా లేకుండా పోతోంది. - సాక్షి, హైదరాబాద్