మాల్యాకు అసలు భారత్ వచ్చే ఉద్దేశం లేదు
న్యూఢిల్లీ: మద్యంవ్యాపారి, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాజీ అధిపతి విజయ్ మాల్యాపై ఢిల్లీ పటియాలా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు అప్పులు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఫెరా ఉల్లంఘన కేసులో సమన్లను తిరస్కరించడంపై , నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. అసలు మాల్యాకు దేశానికి తిరిగి ఇచ్చే ఉద్దేశమే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకు భారత్ రావాలని ఉన్నా పాస్ పోర్టు రద్దయిందంటూ కపటనాటకం ఆడుతున్నాడని, ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నాడని కోర్టు పేర్కొంది. ఇప్పటికే పలుసార్లు ఆదేశాలు జారీ చేశామని, మాల్యాకు భారతీయ చట్టాలపై గౌరవం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది .
కాగా 17 బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలను బాకీ పడి బ్రిటన్ కు పారిపోయిన మాల్యా ఆస్తులను ఈడీ కేసులు నమోదు చేసింది. ఇటీవల సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేసింది. 2012లో చెక్‌బౌన్స్ కేసులో మాల్యాకు మరో ఎన్బీడబ్యూ జారీ చేసింది. తాజాగా ఆగస్ట్ 23న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, మాల్యాపై మరో కేసు నమోదు చేసింది.