అక్రమ బస్సులను అరికట్టండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి తీవ్రనష్టం కలిగించేలా జరుగుతున్న అక్రమరవాణాను నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) మేనేజింగ్ డెరైక్టర్ పూర్ణచంద్రరావు సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పరిస్థితిని సమీక్షించి తీసుకున్న నిర్ణయాలను ఆయన అధికారులకు వివరించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఎం, డీవీఎం, డీఎంలతో ఆయన మాట్లాడారు. అక్రమ రవాణాను నిరోధించడాన్ని ప్రధాన కార్యక్రమంగా భావించాలని పేర్కొన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల ఫొటోలు తీసి స్థానిక రవాణా, పోలీసు శాఖ అధికారులకు అందజేసి వారి సహకారంతో వాటిని నియంత్రించాలని సూచించారు. బస్సుస్టాపుల్లో ఆపే ప్రైవేటు వాహనాల ఫొటోలనూ తీసి అధికారులకు పంపాలన్నారు. పర్మిట్లకు విరుద్ధంగా తిరిగే సెట్విన్ బస్సులపై రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రవాణాశాఖ అధికారులతో జరిపే సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేయాలని ఆదేశించారు. కొత్తగా 500 బస్సులు కొంటున్నందున ఆయా డిపోల పరిధిలోని కాలంచెల్లిన బస్సుల పూర్తి వివరాలను సిద్ధం చేయాలన్నారు. సిద్ధిపేట నుంచి తిరుపతికి సూపర్ లగ్జరీ , సిద్ధిపేట-హన్మకొండ మధ్య ఎక్స్ప్రెస్ బస్సులు తిప్పాలని, సిద్ధిపేట నుంచి ముంబైకి బస్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వరంగల్ -సూరత్ మధ్య బస్సులు నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. బస్సుస్టాండ్లను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఖాళీ స్థలాల్లో చెట్లు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆదేశించారు.