'బాహుబలిని పైరసీకి బలిచేయొద్దు'
హైదరాబాద్: బాహుబలి చిత్రాన్ని ఎవరూ పైరసీకి బలి చేయోద్దని, అలాంటి అవకాశాలను తొలగించాలని కోర్టు పలు ఇంటర్నెట్ నిర్వహణ సంస్థలకు ఆదేశించింది. ఇంటర్నెట్ సంస్థలుగానీ, నెట్ సర్వీసలు సంస్థలు గానీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని పైరసీ చేయకుండా ఉండేలా ఆదేశించాలంటూ ఏ వెంకటేశ్ అనే పిటిషనర్ కోర్టులో పిటిషన్ వేయగా అడిషనల్ చీఫ్ జడ్జి జీవీఎన్ భరత లక్ష్మీ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యునికేషన్స్, భారతీ ఎయిర్ టెల్ వంటి మొబైల్ ద్వారా ఆన్లైన్ సేవలు అందించే సంస్థలకు ప్రత్యేక సూచనలు సూచించారు. బాహుబలి చిత్రానికి సంబంధించిన సన్నివేశాలుగానీ, ఇతర ఏ విధమైన అంశాలుగానీ ఆయా నెట్ సంస్థల ద్వారా ఎవరైనా డౌన్లోడ్ చేసే చర్యలకు పాల్పడటంగానీ, అప్లోడ్ చేయడంవంటి పనులు చేయడంగానీ చేస్తే వాటిని గుర్తించి వెంటనే నియంత్రించాలని చెప్పారు. ఒకవేళ ఇప్పటికే బాహుబలి చిత్రం పైరసీ తాలూకు వీడియోలు ఉంటే వెంటనే వాటిని బ్లాక్ చేయడంగానీ, లేదా పూర్తిగా తొలగించడం గానీ చేయాలని ఆదేశించారు. దాదాపు 250 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం పలు చోట్ల పైరసీకి గురవుతుందని చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.