తడి ‘ఆరే’!
సాగుకు ఆరు గంటలే విద్యుత్
ఏడు గంటల సరఫరాకు మంగళం
ఏపీసీపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ
ప్రమాదంలో రబీ సాగు
సాక్షి, సంగారెడ్డి:
దొంగ చాటు విద్యుత్ కోతలు ఇక అధికారికమయ్యాయి. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ను సరఫరా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. 9 ఏళ్లుగా అమల్లో ఉన్న ‘వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా’ విధానానికి కిరణ్ సర్కార్ మంగళం పాడింది. ఇకపై వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్ మాత్రమే సరఫరా ఉండనుందని ఏపీసీపీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2 నుంచే కోతల ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్పాదన మెరుగయ్యే వరకు ఆరు గంటల సరఫరా మాత్రమ ఉండనుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. అనధికారిక కోతలను అధికారికం చేయడానికే ఈ ఉత్తర్వులను అమల్లోకి తెచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోడ్ రిలీఫ్(ఎల్సీ) పేరుతో రోజూ వ్యవసాయానికి ఎడాపెడా కోతలు పెట్టేస్తున్నారు. ఎల్సీ అమలైన ఫీడర్ల పరిధిలో ఒకే విడతగా 3 గంటల విద్యుత్ సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. మిగిలిన ఫీడర్ల పరిధిలో సైతం 5 నుంచి 6 గంటల సరఫరా మాత్రమే ఉంటోంది. రబీ సాగు ఊపందుకున్న తరుణంలో కోతలు తీవ్రం కావడంతో ఇప్పటికే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బోర్లు, బావుల కింద 32 వేల హెక్టార్లలో వరి పంట వేశారు. ఇప్పుడు మొత్తం సరఫరానే 6 గంటలకు పరిమితం చేయడంతో రబీ సాగు ప్రమాదంలో పడింది.
జిల్లాలో ఉన్న 618 విద్యుత్ ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు పరిధిలో పగలు ఓ విడత, రాత్రి మరో విడత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ కింది వేళల్లో ఆరు గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ నుంచి ఆదేశాలందాయి. రాత్రి వేళల్లో సరఫరా కారణంగా రైతులు ప్రశాంతంగా ఇళ్లలో నిద్రపోయే పరిస్థితి లేకుండా పోయింది.
జిల్లాలో జిల్లాలో 8,97,188 విద్యుత్ కనెక్షన్లుండగా అందులో 5,96,148 గృహ, 59,153 వాణిజ్య, 8057 పారిశ్రామిక, 2,20,246 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం జిల్లాకు రోజూ 15 -17 మిలియన్ యూనిట్ల సరఫరా మాత్రమే ఉంటోంది. పెరిగిన అవసరాల దృష్ట్యా జిల్లా కోటాను రోజూ 22 మి.యూలకు పెంచాలని కోరుతూ రెండు నెలల కింద విద్యుత్ శాఖ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేకుండా పోయింది. భారీ పరిశ్రమలకు నిలయం కావడంతో జిల్లాలో విద్యుత్ అవసరాలు ఎక్కువే. జిల్లాకు సరఫరా చేస్తున్న విద్యుత్‌లో 45 శాతం పారిశ్రామిక, మరో 45 శాతం వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తుండగా.. మిగిలిన 10 గృహ అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు విద్యుత్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
జిల్లా అవసరాలకు రోజూ 22 మి.యూ.ల విద్యుత్ అవసరం కాగా పది రోజులుగా జిల్లాకు సరఫరా అయిన విద్యుత్ ఇలా ఉంది..
తేదీ సరఫరా
(మి.యూ.లలో)
జనవరి 24 17.02
జనవరి 25 17.05
జనవరి 26 16.01
జనవరి 27 16.23
జనవరి 28 16.34
జనవరి 29 16.29
జనవరి 30 16.15
జనవరి 31 16.73
ఫిబ్రవరి 01 16.51
ఫిబ్రవరి 02 15.61