రేప్ జరిగినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం
చండీగఢ్: జాట్ల ఉద్యమం సందర్భంగా హరియాణాలోని సోనిపట్ వద్ద కొందరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందని వచ్చిన వార్తలను ఆర్మీ అధికారులు ఖండించారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి గురువారం వరకూ ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరిగినట్టు సమాచారం లేదని చెప్పారు. కాగా చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
రిజర్వేషన్లు కల్పించాలని జాట్లు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న సోనిపట్ వద్ద ఆందోళనకారులు 10 మంది మహిళా ప్రయాణికులను బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు వివరణ ఇచ్చారు. సోనిపట్ జిల్లాలో హింస చెలరేగడంతో శాంతి భద్రతల బాధ్యతను ఆర్మీకి అప్పగించారు. తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై అత్యాచార ఘటన ఎక్కడా జరగలేదని కల్నల్ బీకే పాండా చెప్పారు.