కోన సీమకు మొండిచేయి
జెడ్పీ పదవుల కేటాయింపుల్లో వివక్ష
మెట్టసీమకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు
సమతూకమెక్కడని పార్టీ నేతల ప్రశ్న
ఫిరాయింపు నేత కోసం సంప్రదాయాలకు తూట్లు
అసంతృప్తిలో టీడీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
టీడీపీలో మరో లొల్లి మొదలైంది. ఫిరాయింపు నేత కోసం ప్రాంతీయ చిచ్చు రేగింది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో ప్రాంతీయ వివక్ష చోటుచేసుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. రెండు పదవులూ మెట్టసీమకే కట్టబెట్టి, కోనసీమను విస్మరించారన్న ఆవేదన నేతల్లో వ్యక్తమవుతోంది. ఆయారాం గయారం కోసం కోనసీమకు మొండి చేయి చూపడం ఎంతవరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది.
.
ఫిరాయింపు నేత కోసం మోకరిల్లిన అధిష్టానం
పార్టీ ఫిరాయించిన నేత కోసం టీడీపీ అదిష్టానం మోకరిల్లితోంది. ఎంతో ఖర్చు పెట్టి, ఎన్నికల్లో కష్టపడి గెలిచి, జెడ్పీ చైక్మన్ అయిన నామన రాంబాబును తొలగించి అనేక పార్టీలు మారిన జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కు ఆ పదవి కట్టబెడుతోంది. క్రమశిక్షణతో పనచేసి సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన నేతలను విస్మరించి జంప్ జిలానీలే తమకు ఎక్కువని చెప్పకనే అధిష్టానం సందేశం పంపించింది. నాటకీయ పరిణామాల మధ్య జ్యోతుల నవీన్‌కు లైన్ క్లియర్ చేసింది. అటు చైర్మన్, ఇటు వైస్ చైర్మన్లను రాజీనామా చేయించి, తాత్కాలిక చైర్మన్‌గా నవీన్‌ను గద్దెనెక్కించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేయించింది. ఇప్పుడా ఉత్తర్వుల మేరకు శనివారం తాత్కాలిక చైర్మన్‌గా నవీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతానికి తాత్కాలికమే అయినప్పటికీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత అధికారిక చైర్మన్‌గా ఎంపిక చేయనుంది. ఇక ఆపద్ధర్మ ఛాన్స్ దక్కనివ్వకుండా ఉద్దేశ పూర్వకంగా రాజీనామా చేయించిన వైస్ చైర్మన్‌కు మళ్లీ అదే పదవి కట్టబెడతామని పార్టీ పెద్దలు ప్రకటించడంతో నళినీకాంత్ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అంతా సద్దుమణిగిందని అగ్రనేతలు సేదదీరుతున్నారు. కానీ ఇప్పుడే వారికి అసలు సిసలైన రాజకీయం ఎదురవుతోంది.
.
రెండూ మెట్ట మకేనా?
టీడీపీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక సంప్రదాయం కొనసాగుతోంది. చైర్మన్ ఒక ప్రాంతానికిస్తే, వైస్ చైర్మన్ మరో ప్రాంతానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీడీపీలో మాత్రం జెడ్పీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారు. 2001లో తూర్పు డెల్టా ప్రాంతానికి చెందిన దున్నా జనార్థనరావును చైర్మన్ చేయగా...అదే ప్రాంతానికి చెందిన చింతపల్లి వీరభద్రరావును వైస్ చైర్మన్ చేశారు. అప్పట్లో దీనిపై వివాదం చోటుచేసుకుంది. కొందరు నేతలు అభ్యంతరం చెప్పడమే కాకుండా అలక పూనారు. మళ్లీ ఇప్పుడదే సీన్ పునరావృతమయింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండూ ఒకే ప్రాంతానికి కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అది కూడా అనేక పార్టీలకు వెన్నుపోటు పొడిచిన నేత కోసం ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. కొత్తగా చైర్మన్ అవుతున్న జ్యోతుల నవీన్‌కుమార్, మరోసారి వైస్ చైర్మన్ అవుతున్న నళినీకాంత్ మెట్టసీమకు చెందిన వారని, ఈ విషయంలో కోనసీమకు మొండి చేయి చూపుతున్నారని వాపోతున్నారు. మొన్నటివరకు సమతూకంగా ఉండేదని, ఫిరాయింపు నాయకుడి కోసం సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఒక ప్రాంతాన్ని విస్మరించడం బాధాకరమని, భవిష్యత్తులో పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉండటంతో బయటపడలేకపోతున్నామని...సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామంటూ చిర్రుబుర్రులాడుతున్నారు.