అక్కడ గ్యాంగ్‌రేప్ జరగలేదట!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య, గ్యాంగ్‌రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రాథమిక విచారణను బట్టి చూస్తే, అసలక్కడ అత్యాచారం అన్నదే జరగలేదని తేలింది. గ్రేటర్ నోయిడాలోని జేవర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలపై గ్యాంగ్ రేప్ చేసి, ఒక వ్యక్తిని కాల్చి చంపేశారంటూ దేశవ్యాప్తంగా మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. అయితే, బాధితులని చెబుతున్న మహిళలకు వైద్యపరీక్షలు చేసిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాగ్ భార్గవ్ మాత్రం అసలు అత్యాచారం జరిగిన ఆనవాళ్లే లేవని స్పష్టం చేశారు. యమునా ఎక్స్‌ప్రెస్ వే మీద ఆరుగురు దుండగుల బృందం వారిని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసిందని ఆరోపణలు వచ్చాయి. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాల్చి చంపారన్నారు.
దీనిపై నోయిడా జిల్లా కలెక్టర్ బీఎన్ సింగ్, సీనియర్ ఎస్పీ లవ్ కుమార్, డాక్టర్ భార్గవ్ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళలకు ఎలాంటి గాయాలు కాలేదని, అలాగే వీర్యం ఆనవాళ్లు కూడా ఏమీ లేవని డాక్టర్లు నిర్ధారించినట్లు భార్గవ్ చెప్పారు. వారి దుస్తులు, టిష్యూ శాంపిళ్లను లక్నోలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి, తదుపరి పరీక్షలు చేయిస్తామన్నారు. రెండు మూడు వారాల్లో ఆ పరీక్ష ఫలితాలు వస్తాయి. ప్రాథమిక దర్యాప్తులో గ్యాంగ్ రేప్ జరగలేదని చెబుతున్నా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చేవరకు ఆ కేసులో ఆ ఆరోపణలు అలాగే ఉంటాయని లవ్ కుమార్ చెప్పారు. పొరుగు రాష్ట్రాల పోలీసులను కూడా రంగంలోకి దించి కేసును తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం వరకు అందిన వివరాలను బట్టి ఇది కేవలం దోపిడీయే అయి ఉండొచ్చని వివరించారు.