ప్రీమియం తగ్గించుకోవడానికెన్నో మార్గాలు
ఇప్పుడు జీవిత బీమా కంపెనీలు, సాధారణ బీమా కంపెనీలు కూడా ఆరోగ్య బీమా రంగంలోకి వచ్చేశాయి. ఈ రెండింటితో పాటు ఆరోగ్య బీమా కోసమే కొన్ని ప్రత్యేక కంపెనీలు వచ్చి చేరాయి కూడా. దీంతో ప్రీమియం రేట్లు, ఏఏ వ్యాధులకు బీమా కవరేజీ ఉంటుంది... క్లెయిమ్ ఎలా ఉంటుంది... ఇవన్నీ కంపెనీని బట్టి మారిపోతున్నాయి. పాలసీదారులను ఆకర్షించడానికి కంపెనీలు కొత్త మార్గాలు వెదుకుతున్నాయి. ఇందులో భాగంగా తక్కువ ప్రీమియంతో బీమా పాలసీలను ఇవ్వడానికి కో-పేమెంట్, డిడక్టబుల్ వంటి కొత్త పద్ధతుల్ని అందుబాటులోకి తెచ్చాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకోవటంతో పాటు ఇంకాస్త తెలివిగా వ్యవహరిస్తే ప్రీమియం భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు.
కో-పేమెంట్ అంటే..?
పేరుకు తగ్గట్లే ఏదైనా సంభవించి ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వచ్చినపుడు బీమా కంపెనీతో పాటు పాలసీదారు కూడా కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకే దీన్ని కో-పేమెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మనమెంత చెల్లించాలి? బీమా కంపెనీ ఎంత చెల్లించాలి? అనేది మనం ముందే ఎంచుకోవచ్చు. ఆ ఎంపిక బట్టే పాలసీ ప్రీమియం కూడా ఉంటుంది. సాధారణంగా బీమా కంపెనీలు కో-పేమెంట్ కింద 5 నుంచి 25 శాతం వరకూ పాలసీదారు చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆ మేరకు ప్రీమియం భారం తగ్గుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి చికిత్స చేయించుకుంటే బిల్లు లక్ష రూపాయలు అయిందనుకుందాం. ఆ వ్యక్తి ఆరోగ్య బీమా పాలసీలో 20 శాతం కో-పేమెంట్ ఆప్షన్ గనక తీసుకుంటే... బిల్లులో 20 శాతం అంటే రూ.20,000 పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.80,000 బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ విధానం చిన్న వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారికి లేదా వృద్ధాప్యంలో పాలసీ తీసుకునే వారికి అనువైనదని చెప్పొచ్చు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చిన్న వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వారి విషయంలో క్లెయిమ్‌లు సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని అధిక ప్రీమియం చెల్లించకుండా... ఏదైనా చికిత్స వస్తే చిన్న మొత్తంతో బయటపడే అవకాశం కో-పేమెంట్‌తో సాధ్యమవుతుంది. అలాగే పెద్ద వయసులో ఉన్న వారు పాలసీ తీసుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా కో-పేమెంట్ ఆప్షన్ ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు. విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన కో-పేమెంట్ విధానంపై మన కంపెనీలు కూడా ఇప్పుడు అధికంగా దృష్టి పెడుతున్నాయి. ఈ విధానంలో పాలసీదారుడు కూడా క్లెయింలో భాగస్వామి కాబట్టి అవసరం లేని వైద్య పరీక్షల వంటివి లేకుండా బిల్లును నియంత్రించే అవకాశం ఉంటుంది. అందుకని కంపెనీలు ఈ కో-పేమెంట్ విధానాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నాయి.
డిడక్టబుల్ అంటే...
దీని పనితీరు కూడా దాదాపు కో-పేమెంట్లానే ఉన్నా చాలా తేడా ఉంటుంది. శాతాలతో సంబంధం లేకుండా చికిత్సలో నిర్దిష్ట మొత్తాన్ని భరిస్తామని ముందుగా బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడాన్నే డిడక్టబుల్స్ అంటారు. ఇక్కడ క్లెయిమ్ మొత్తంతో సంబంధం లేకుండా పాలసీదారుడు ముందుగా అంగీకరించిన మొత్తం చెల్లిస్తే మిగిలిన మొత్తం బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఉదాహరణకు మీరు ఏదైనా బీమా కంపెనీ నుంచి హెల్త్ ప్లాన్ తీసుకొని అందులో డిడక్టబుల్స్ ఆప్షన్ కింద రూ.50,000 ఎంచుకున్నారనుకుందాం. ఇటువంటి సమయంలో ఏదైనా క్లెయిమ్ సంభవిస్తే ముందుగా మీరు రూ.50,000 చెల్లిస్తే ఆ పైన జరిగిన వ్యయాన్ని కంపెనీ భరిస్తుంది.
ఒకవేళ మొత్తం చికిత్సా వ్యయం రూ.80,000 అయితే కంపెనీ కేవలం రూ.30,000 మీరు రూ.50 వేలు చెల్లిస్తారు. అలా కాకుండా రెండు లక్షలు బిల్లు అయితే మిగిలిన లక్షా యాభైవేలు కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ చికిత్స వ్యయం రూ.50వేల లోపు అయితే పాలసీదారే చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పటికే ఏమైనా వ్యాధులున్న వారికి ఈ విధానం అనువుగా ఉంటుందని చెప్పొచ్చు. ఉదాహరణకు డయాబెటిస్, రక్తపోటు వంటివి ఉంటే దానికి అనుగుణంగా డిడక్టబుల్ అమౌంట్‌ను నిర్ణయించుకోవడం ద్వారా ప్రీమియం భారాన్ని తగ్గించుకోవచ్చు.
తక్కువ ప్రీమియానికి మరిన్ని జాగ్రత్తలు...
50 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు వ్యక్తిగత పాలసీల కంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నా, లేక గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చేరినా ప్రీమియం బాగా తగ్గుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా చోటు కల్పిస్తున్నాయి. ఇలా వీళ్లందరినీ కలిపి తీసుకోవడం ద్వారా ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు.
చిన్న వయసు నుంచే పాలసీని కొనసాగించడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే పెద్ద వయస్సు వచ్చాక కూడా పాలసీని కొనసాగించుకునే వెసులుబాటు లభిస్తుంది. క్లెయిములు లేని సంవత్సరాల్లో బీమా కంపెనీలు నో-క్లెయిమ్ బెనిఫిట్ కింద ప్రీమియం తగ్గించడం లేదా బీమా రక్షణ మొత్తాన్ని పెంచడం వంటివి చేస్తుంటాయి. దీంతో దీర్ఘకాలంలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందొచ్చు.
ఆరోగ్య బీమా పాలసీలను ఏజెంట్ ద్వారా కాక నేరుగా బీమా కంపెనీ లేదా ఆన్లైన్ ద్వారా కొంటే ప్రీమియంలో కొంత మినహాయింపు లభిస్తుంది.
మీ ఆరోగ్య స్థితి, ఆహారపు అలవాట్లు కూడా ప్రీమియం ధరలను నిర్దేశిస్తాయి. ధూమపానం, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉంటే ఆ మేరకు ప్రీమియం తగ్గుతుంది. ఈ మధ్య బీమా కంపెనీలు యోగా, వ్యాయామం చేసే వారికి ప్రీమియం రేట్లపై తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం