తెలుగుపై మరో దెబ్బ
సవతి ప్రేమతో తమిళనాడులోని తెలుగు ప్రజలు మరోసారి దెబ్బతింటున్నారు. నిర్బంధ తమిళం చట్టం పేరుతో తెలుగుభాషకు తగిలిన గాయంపై మరో దెబ్బపడనుంది. తేజోమయ తెలుగు భాష బోధనకు ‘మెట్రో’ ముసుగు కప్పేసేందుకు రంగం సిద్ధమైంది. 2006లో నిర్బంధ తమిళ చట్టంతో తెలుగుభాషకు అన్యాయం చేయగా, 2016లో తెలుగువారికి ప్రీతిపాత్రమైన చారిత్రాత్మక సర్ త్యాగరాయ కాలేజీపై నిర్బంధ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తెరమరుగు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పటి మద్రాసు మహాన గరానికి నార్త్మెడ్రాస్ (నేటి ఉత్తర చెన్నై) గుండెకాయ వంటిది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం భాషా ప్రయోక్త రాష్ట్రాల విభజనతో మూడు ముక్కలుగా విడిపోయినా, మద్రాసు నగరం చెన్నైగా రూపాంతరం చెందినా నార్త్ మెడ్రాస్ నేటికీ చెక్కుచెదరలేదు. అనాదిగా స్థిరపడిపోయి అత్యధిక సంఖ్యాకులైన తెలుగువారితో ఆనాటి ఆనవాళ్లకు నేటికీ నిలువెత్తు సాక్షిగా నిలిచి ఉంది. ఇలాంటి ఆనవాళ్లలో సర్ త్యాగరాయ కాలేజీ ఒకటి. అపర దానకర్ణులైన పిట్టి త్యాగరాయచెట్టి తన మాతృభాష తెలుగుకు ఎంతో కొంత సేవ చేయాలన్న ఆశయంతో తండియార్పేట, తిరువొత్తియూరు హైరోడ్డులో 5.5 ఎకరాల విస్తీర్ణంలో 1897లో నార్త్మెడ్రాస్ సెకండరీ స్కూల్‌ను స్థాపించారు. 1917లో పిట్టి త్యాగరాయ చెట్టి ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించి విద్యా సేవలను మరింతగా విస్తరించడంతో 1950లో సర్ త్యాగరాయ కాలేజీ ఏర్పడింది.
తమిళనాడులోని తెలుగువారి కోసం ప్రత్యేకం ఏర్పడిన ఈ కాలేజీకి కొన్నాళ్లు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ కూడా అధ్యక్షులుగా ఉన్నారు. కాలేజీ ఆవిర్భావంతో స్కూల్‌ను కొరుక్కుపేటకు మార్చారు. మద్రాసు యూనివర్సిటీ అనుబంధంగా 1950లో ఇంటర్‌తో ప్రారంభమై 1954లో బీఏ(మేథ్స్), 1956లో బీఏ (ఎకనమిక్స్, హిస్టరీ) 1957లో బీఎస్సీ(జువాలజీ) 1965 సాయంత్రం కాలేజీ, 1979లో పోస్టుగ్రాడ్యుయేషన్ ఇలా అంచలంచెలుగా ఎదిగింది. 2003లో హిస్టరీ, ఎకనమిక్స్ రీసెర్చ్ డిపార్టుమెంటును మంజూరు చేసి కాలేజీని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సుమారు 1590 మంది విద్యార్థులు చదువుతున్నారు. నేటికీ ఈ కాలేజీలో తెలుగు విభాగం ఉంది, తెలుగు భాషలో బోధన సాగుతోంది. తెలుగును అభ్యసించేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులు ఈ కాలేజీలో చేరుతుంటారు.
నిండనున్న నూరేళ్లు
పిట్టి త్యాగరాయ చెట్టి ట్రస్ట్ స్థాపించి వచ్చే ఏడాదికి వందేళ్లు నిండుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. అయితే ఉరుములేని పిడుగులా మెట్రో పనులు పిట్టి త్యాగరాయ కాలేజీని మింగేయనున్నాయి. 5.5 ఎకరాల్లోని త్యాగరాయకాలేజీలో 1.17 లక్షల చదరపు అడుగులను మెట్రో రైలు స్టేషన్ కోసం స్వాధీనం చేసుకోబోతున్నట్లు కాలేజీ యాజమాన్యానికి జనవరి 21వ తేదీ నుంచి నోటీసులు రావడం ప్రారంభమైంది. స్థల స్వాధీనానికి తుది హెచ్చరికగా ఫారం ఇ నోటీసును గత నెల 12వ తేదీన జారీ చేశారు.
కాలేజీ యాజమాన్యానికి అందిన నోటీసులో 348 పాక్షికం, 1763 పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. అయితే ఆ సంఖ్య మీటర్లా, అడుగులా, తాత్కాలికమా, శాశ్వతమా అనే వివరాలను స్పష్టంగా పేర్కొనక పోవడం, ప్రజల ఆస్తుల స్వాధీనంపై అధికారుల నిర్లక్ష్యాన్ని చాటిచెప్పింది. 1997లో తమిళనాడు ప్రభుత్వం చేసిన ఒక చట్టం ప్రకారం ప్రజలు కాదనకుండా ఇళ్లను, స్థలాన్ని అప్పగించాల్సి ఉంది. అంతేకాదు, స్థలం కొలతలకు, స్వాధీనానికి వచ్చేవారిని అడ్డుకుంటే ఆరునెలల జైలు, రూ.1000 జరిమానా అనే హెచ్చరికలను సైతం ఆ చట్టంలో పొందుపరిచారు. మెట్రో పనుల కోసం కాలేజీ మైదానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే హక్కుందని చట్టాన్ని చూపి భయపెడుతున్నారు.
ప్రస్తుతం ఈ స్థలంలో కాలేజీ వార్షికోత్సవాల వేదిక, మైదానం ఉంది. కాలేజీ భూగర్భంలో సొరంగమార్గంలో రైల్వేస్టేషన్తోపాటూ మెట్రోరైలు పరుగులు పెట్టేలా రూపకల్పన చేశారు. మెట్రో ప్లాన్ సమయంలో కాలేజీ యాజమాన్యాన్ని నామమాత్రం కూడా సంప్రదించలేదని పిట్టి త్యాగరాయచెట్టి కుటుంబంపై అభిమానమున్న వర్గాల ద్వారా తెలిసింది. వన్నార్‌పేట-విమ్కోనగర్ మధ్య మెట్రో మార్గంలోని స్థల సేకరణలో అన్నికంటే ఎక్కువగా విస్తీర్ణాన్ని నష్టపోతున్నది త్యాగరాయకాలేజీ మాత్రమే కావడం విషాదకరం.
పేదల ఇళ్లకు శాపం
దక్షిణ చెన్నైలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు సేవలను ఉత్తర చెన్నైకి విస్తరించారు. వాషర్‌మెన్‌పేట్-విమ్కోనగర్ మధ్య రానున్న మెట్రోలైన్లు తిరువొత్తియూరు హైరోడ్డు, పాత వన్నార్పేటపేట, తండయార్‌పేట మీదుగా వెళ్లనున్నాయి. ఈ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు వస్తున్నాయి. వీటిల్లో రెండు అండర్ గ్రౌండ్ స్టేషన్లు కాగా, ఒకటి త్యాగరాయకాలేజీలో, మరొకటి అగస్త్య థియేటర్ కింద వస్తున్నాయి. నార్త్మెడ్రాస్లో మొదలు కానున్న మెట్రో పనులు తరతరాలుగా స్థిరపడిపోయిన 60 శాతానికి పైగా ఉన్న తెలుగువారిని ఎక్కువగా భయపెడుతున్నాయి.
రామానుజయ అయ్యర్ వీధిలోని 20 ఇళ్లలో, ఏడు ఇళ్లు పూర్తిగానూ, 8 ఇళ్లు పాక్షికంగానూ మెట్రో మింగేయనుంది.వాస్తవానికి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) అనేది ఒక ప్రయివేటు సంస్థ, వారికి చెన్నై ప్రజల ఆస్తులను ప్రభుత్వం బలవంతంగా ధారాదత్తం చేయడం ఏమిటనే వాదనతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణ పనులను యథాతథంగా జరిపిస్తే మొత్తం 20 వేల దుకాణాలు, 7 విద్యాసంస్థలు, 6 చారిత్రాత్మక ఆలయాలు, 50 వేల మందికి ఉపాధి అవకాశాలు, 1.20 లక్షల మంది జీవనోపాధి కోల్పోకతప్పదని దీనిపై అధ్యయనం చేసిన ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. చెన్నై నగరంలో 15 ఏళ్ల క్రితం ప్రారంభించిన మెట్రో పనుల్లో సొరంగ మార్గం పనుల్లోనే జాప్యం జరుగుతున్న సంగతి అందరికి తెలుసని అన్నారు.
విశాలంగా ఉండే నగరం నడిబొడ్డులోనే సొరంగం పనులు సక్రమంగా సాగనపుడు అత్యంత ఇరుకుప్రాంతమైన నార్త్మెడ్రాస్లో మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిర్దాక్ష్యిణ్యంగా జారీ అవుతున్న నోటీసులు, ఉత్తర్వులపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా అధికారులు బదులు ఇవ్వక పోవడం హిట్లర్ రాజ్యాన్ని తలపిస్తున్నదని అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి అంటూ 200 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులకు స్పీడ్ పోస్టులో ఉత్తరాలు పంపితే కేవలం మూడింటికి మాత్రమే ఎకనాలెడ్జ్మెంట్ వచ్చిందని ఆయన వాపోయారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
తిరువొత్తియూరు వరకు మెట్రో రైలు పొడిగిం పు తో సొంత ఇల్లు కోల్పోతున్నాను. ఐదు తరా ల నుంచి ఇక్కడే జీవిస్తున్నాం. ఇల్లు కోల్పోతుం డడం చెప్పలేని బాధగా ఉంది. చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) వారు భయబ్రాంతులకు గురిచేస్తూ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీహెచ్ రోడ్డు వైపు ఉండే ఇళ్లకు నష్టపరిహారాన్ని చదరపు అడుగుకు రూ.6 వేలు, రోడ్డు లోపలవైపు ఇళ్లకు రూ.2 వేలు ఇస్తామని చెప్పారు. ఇది న్యాయంకాదు. నూరేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న త్యాగరాయకాలేజీ స్థలం స్వాధీనానికి మెట్రో అధికారులు నోటీసులు జారీ చేయడం ఆవేదన కలిగిస్తోంది.
- సత్యనారాయణ, తెలుగు బాధితుడు
నష్టపరిహారాన్ని
సమానంగా ఇవ్వాలి
మెట్రోరైలు కారణంగా ఇళ్లను కోల్పోతున్న బాధితులకు ఒక్కొక్కరి ఒక్కో రకంగా కాకుండా అందరికి సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. అలా కాదంటే నగరంలో ఎక్కడైనా స్థలం లేదా ఫ్లాట్ ఇవ్వాలి, బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పించాలి. సీఎంఆర్ఎల్ వారు వచ్చి దౌర్జన్యంగా తక్కువ ధరకు ఇల్లు లాక్కునేలా ప్రయత్నిస్తున్నారు. సొంత ఇల్లు కోల్పోవడం వల్ల పిల్లల భవిష్యత్తు అధోగతి పాలవుతందనే ఆందోళన ఉంది. చిన్న చిన్నపనులు చేసుకుని జీవిస్తున్నాం... ఇల్లు కోల్పోతుండడం బాధగా ఉంది.
- రాజశేఖర్, తెలుగు బాధితుడు