ఉత్తర చెన్నై చిన్నదిగా ..
పొల్లాదవన్ చిత్రంలో ఉత్తర చెన్నైని వెండి తెరపై ఆవిష్కరించిన దర్శకుడు వెట్రిమారన్. ఆయన ఇప్పుడు ఏకంగా వడచెన్నై(ఉత్తర చెన్నై) పేరుతోనే చిత్ర రూపకల్పనకు సిద్ధమయ్యారు. ఇందు కోసం ఏళ్ల తరబడి కథా చర్చలు, పరిశోధనలు, షూటింగ్‌కు ప్రాంతాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రాన్ని బాహుబలి చిత్రం తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంలో ఆయన ఆస్థాన నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించనున్నారు.లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత నాయకిగా నటించనున్నారు. ఇందు కోసం తను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
సమంత దక్షిణ చెన్నైకి చెందిన యువతి అన్న విషయం తెలిసిందే. స్థానిక పల్లావరంలో పుట్టి పెరిగిన ఈ చిన్నది వడచెన్నై చిత్రం కోసం ఉత్తర చెన్నై అమ్మాయిగా మారనున్నారు. ఉత్తర చెన్నై ప్రాంత ప్రజల జీవన విధానానికి దక్షిణ చెన్నై ప్రాంత జనజీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉత్తర చెన్నై ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. అక్కడి ప్రజల జీవనంలో పోట్లాటలు, కొట్లాటలు ఒక భాగం అని చెప్పవచ్చు. వారి ప్రవర్తన, శారీరక భాష భిన్నంగా ఉంటుంది.
నటి సమంత ఇప్పుడు వారిలా మారనున్నారు. వారితో మమేకమై వారి జీవనవిధానాన్ని, వేష భాషలను సునితంగా పరిశీలించనున్నారు. అందుకు తను 10 రోజులు కేటాయించినట్లు సమాచారం. అయితే ఆ ప్రాంతం ఏది?ి సనిమా చిత్రీకరణ ప్రాంతం ఎక్కడ అన్న విషయాలను దర్శకుడు రహస్యంగా ఉంచినట్లు తెలిసింది. వడచెన్నై చిత్రం ఎప్పుడు సెట్‌పైకి వెళ్లనుందన్న విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది.