ఉత్తరకొరియా సైనికులు.. దొంగలు..
సాక్షి, ప్యాంగ్యాంగ్: ఆనాటి నియంతల కాలం ఎలా సాగిందో.. నేడు ఎలా సాగుతోందో తెలుసుకోవడానికి పచ్చి ఉదాహరణ ఈ ఉదంతం. ఉత్తరకొరియా ఆర్మీ సైనికులు దొంగలుగా మారారు. ఉద్యోగాలు మాని వారు దొంగలుగా మారలేదు. వారిని దొంగలుగా మార్చింది ఆకలి. సైన్యం అంతటికి అవసరమైన ఆహారం ఎలా తేవాలో తెలియని అధికారులు నిస్సహాయత కింది స్థాయి సైనికులకు దొంగలుగా మారాలనే సలహా ఇప్పించింది.
1990 దశాబ్దంలో ఉత్తరకొరియా తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంది. అది మొదలు నేటి వరకూ దేశంలోని ఏ ప్రాంతంలో పేదవాడు మూడు పూట్ల భోజనం చేసిన దాఖలాలు లేవు. ఉత్తరకొరియాలోని ఉత్తర ప్రాంతంలో ప్రతి ఏటా సెప్టెంబర్ ప్రారంభం నుంచి మొక్కజొన్న పంటను రైతులు అత్యధికంగా పండిస్తారు. దీంతో ఆ పంటను దోచుకునేందుకు కింది స్థాయి సైనికులను అధికారులు ప్రోత్సహిస్తారు.
ఒకవేళ దొంగతనం చేయడానికి సైనికులు వెనుకాడితే.. యుద్ధం వస్తే ఆకలితో అలమటించిపోతారని హెచ్చరిస్తారు. దీంతో చేసేదేం లేక సైనికులు రైతులు పండించే పంట పొలాలపై పడి మొత్తాన్ని దోచుకుని వస్తారు. దళారులతో మాట్లాడి దొంగిలించిన పంటలో కొంత భాగాన్ని తక్కువ రేటుకే మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటారు.
ఆ తర్వాత మిగిలిన మొక్కజొన్న పంటను తమ గోడౌన్లకు తరలించి దాచుకుంటారు. తమ పంటలను కాపాడుకోవడానికి రైతులు రాత్రింబవళ్లు పంటపొలాల్లోనే కావలి ఉంటారు. అయినా కూడా నేర్పరులైన సైనికులు వారి కళ్లు కప్పి పంటను దోచుకువెళ్తూనే ఉంటారు. ఆర్మీ దుశ్చర్యపై ఉత్తరకొరియా ప్రజలు మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే ఉండడు. అదనంగా వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తారు.