ఇంకా ఉన్నాయ్!
పనులు చేయకుండా బిల్లులు మాయం కేసు...
తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు
మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు
కుత్బుల్లాపూర్: పనులు చేయకుండానే బిల్లులు మింగిన బాగోతానికి సంబంధించి తవ్వినకొద్దీ అవినీతి కాంట్రాక్టర్ల జాబితా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఈ జాబితాలో చేరారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ కార్యాలయం వేదికగా రూ.46 లక్షల విలువైన 24 పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మాయం చేసిన విషయమై జూలై 6న ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన అధికారులు ఆరుగురు కాంట్రాక్టర్లు, సహాయ కాంట్రాక్టర్, ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, నార్త్‌జోన్ కార్యాలయంలో పనిచేసే ఆడిటర్లపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లను జూలై17న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించి పోలీసులు అరెస్టు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. తాజాగా శుక్రవారం అందరికీ బెయిల్ మంజూరైనట్టు తెలిసింది. తాము పనులు చేయకుండా కాజేసిన నిధులను జూలై 31లోగా వెనక్కి ఇస్తామని కోర్టుకు చెప్పిన కాంట్రాక్టర్లలో ఐదుగురు సంబంధిత మొత్తాన్ని వెనక్కి ఇచ్చారు. మరో ఇద్దరు సగం చెల్లించి.. మిగతా మొత్తానికి 15 రోజుల గడువు కావాలని కోర్టును అభ్యర్ధించారు.
వెలుగు చూస్తున్న అక్రమాలు
పనులు చేయకుండానే బిల్లులు కాజేసిన సంఘటనలో మరో ఇద్దరు పాత్రధారులుగా తేలారు. ఈమేరకు సంబంధిత అధికారులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్వాల్‌కు చెందిన బి.లక్ష్మణ్ జగద్గిరిగుట్ట డివిజన్లో రూ. 2.30 లక్షలు విలువ చేసే పనులను చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించారు. మరో కాంట్రాక్టర్ రూ.62 వేలు తీసుకున్నట్లు జీడిమెట్ల పోలీసులకు తాజాగా ఇంజినీరింగ్ అధికారులు ఫిర్యాదు చే శారు.