ఆదివాసీలను విడదీయొద్దు
ములుగును జిల్లా చేయాలి
సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
ములుగు : షెడ్యూల్డ్ ప్రాంతంలోని ఆదివాసీలను విడదీసే హక్కు ప్రభుత్వానికి లేదని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్ అన్నారు. మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై పాఠశాల విద్యార్థులతో కలిసి గురువారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ భూభాగాన్ని విభవించరాదని రాజ్యాంగం, చట్టాలు చెబుతున్నా అవేమీ పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. జిల్లాల పునర్విభజన ప్రజాభిప్రాయాల మేరకు జరగాల్సి ఉన్నా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యమాలే ఉండవని చెప్పిన కేసీఆర్ నేడు జిల్లాల కోసం జరుగుతున్న ఉద్యమాలను ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. అన్ని అర్హతలు ఉన్న ములుగును కాదని బొందలగడ్డ భూపాలపల్లిని జిల్లా చేయడం రాజకీయ లబ్ధికోసమేనని ఆరోపించారు. ములుగును జిల్లా చేయకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆందోళనకు వైఎస్సార్ సీపీ నాయకుడు కలువాల సంజీవ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ములుగు డివిజన్ ఇన్చార్జీ చెట్టబోయిన సారంగం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్, నాయకులు కాకి రవిపాల్, ఎండబి. మునీంఖాన్, గుగులోతు సమ్మన్న, కనకం దేవాదాసు, మల్లేశ్, ఈర్ల నర్సింహస్వామి, అజ్మీరా హరీశ్, విద్యార్థులు పాల్గొన్నారు.