కరువు సాయం అందేదెప్పుడో..?
ఇంకా జమకాని ‘రుణమాఫీ’
కొత్తరుణాలు అందక రైతన్న ఇబ్బందులు
ఎల్కతుర్తి : రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరందక పంటలు ఎండిపోయి అన్నదాతలు అప్పులపాలయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆరునెలల క్రితం నష్టపోయిన పంటను సర్వే చేసి ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించినా నేటికి అందక పోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మండల పరిధిలో ఈ సారి వర్షాలు ఆలస్యంగా కురిసినా ఆశించిన మేర చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా మూడో విడతlరుణమాఫీ సైతం ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయకపోవడం వల్ల అధికారులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రెండు పసళ్లుగా పంటలు పండకపోవడంతో అధిక వడ్డీకి సైతం అప్పు పుట్టడం లేదు.
గత సీజన్లో పరిస్థితి..
మండలంలోని 15 గ్రామాల పరిధిలో ఎనిమిది వేల హెక్టార్ల వ్యవసాయ విస్తీర్ణం ఉండగా గత ఖరీఫ్‌లో వరి 800 హెక్టార్లు సాగుచేయగా ఇందులో సుమారు 35 శాతానికి పైగా ఎండిపోయాయి. అలాగే మొక్కజొన్న 500 హెక్టార్లలో సాగు చేయగా దిగుబడి భారీగా తగ్గింది. పంట నష్టాన్ని అంచానా వేసే సమయానికి వరి, మొక్కజొన్న పంటలు కోత కోయడంతో వాటిని అధికారులు అంచనా వేయలేదు. కేవలం పత్తి 4,800 హెక్టార్లు సాగుచేయగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో 2,925 హెక్టార్ల పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినా ప్రభుత్వం కేవలం పంట పరిహారం కింద మండలానికి రూ.1కోటి 90లక్షలు మంజూరు చేసింది. ఏడాది గడిచినా రైతులకు పరిహారం అందకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ఖరీఫ్‌లో పంటసాగు చేయడానికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. .
పరిహారం అందించాలి
–బరం రాజయ్య రైతు సూరారం
కరువు మండలంగా ఎంపిక చేసినా నేటికి రూపాయి పరిహారం అందలేదు. పత్తిపంట నష్టంపై సర్వేనిర్వహించి ఏడాది గడుస్తంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిహారం వెంటనే అందించాలే. పెట్టుబడి భారం కొంతైనా తగ్గుద్ది.
ప్రభుత్వానికి నివేదించాం
–ఏవో లక్ష్మారెడ్డి, ఎల్కతుర్తి
మండలంలో పత్తిపంట నష్టంపై సర్వే చేసి 2090 హెక్టార్ల పంటకు నష్టం వాటిళ్లినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఈ మేరకు రూ.1కోటి 90లక్షలు పరిహారం మంజూరైంది. త్వరలోనే రైతులకు అందజేయనున్నాం.