బీసీ స్టడీసర్కిల్‌కు మోక్షమెప్పుడో..?
భవన నిర్మాణానికిరాని మంజూరు
నాలుగు జిల్లాల్లో గ్రీన్‌సిగ్నల్
కరీంనగర్‌కు దక్కని చోటు
నిధులుండీ నిర్మాణం చేపట్టని సర్కారు
కరీంనగర్ సిటీ : బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి ఇప్పట్లో మోక్షం కలిగేలా పరిస్థితులు కల్పించడంలేదు. నిధులు విడుదలై శంకుస్థాపన చేసుకున్నా పనులు, మంజూరుకు మాత్రం నోచుకోవడంలేదు. తాజాగా నాలుగు జిల్లాల్లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. అందులో కరీంనగర్‌ను విస్మరించడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం రాజకీయ కోణంలోనే కరీంనగర్‌కు చోటు లభించలేదనే విమర్శలొస్తున్నాయి.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే అందులో కరీంనగర్ గురించి ప్రస్తావన లేకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.3.65 కోట్లతో నిజామాబాద్‌లో, రూ.8.70 కోట్లతో హైదరాబాద్, రూ.3.75 కోట్లతో ఆదిలాబాద్, రూ.3.70 కోట్లతో సంగారెడ్డి (మెదక్)లో బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణాలకు మెమో నెం.టీ4/24/2017–17, తేదీ 11.08.2016 ద్వారా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 2013లో శంకుస్థాపన చేసుకుని మంజూరుకు ఎదురుచూస్తున్న కరీంనగర్ బీసీ స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు.
మూడేళ్లయినా కలగని మోక్షం..
2009 ఆగస్టు 3న జిల్లా కేంద్రంలో ఎస్సారార్ కళాశాల ఎదురుగా ఆర్అండ్బీ క్వార్టర్స్ సముదాయంలో బీసీ స్టడీసర్కిల్‌ను ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న భవనంలో స్టడీసర్కిల్ నిర్వహిస్తుండడంపై విమర్శలొచ్చాయి. స్టడీసర్కిల్‌కు సొంత భవనం నిర్మించాలంటూ అభ్యర్థులు, వివిధ సంఘాల బాధ్యులు కోరుతూ వచ్చారు. చివరకు 2013లో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ చొరవతో భవన నిర్మాణానికి బీజం పడింది. ఇందుకోసం నగరంలోని సప్తగిరికాలనీ ఆబాదికుంట శిఖంలో వేయిచదరగపు గజాల స్థలాన్ని కేటాయించారు. రూ.2 కోట్ల 40 లక్షల వ్యయంతో నాలుగు అంతస్తులతో భవనం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తన వాటాగా పొన్నం ప్రభాకర్ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయించారు. మరో రూ.50 లక్షలు రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌తో మంజూరు చేయించారు. మిగిలిన రూ.కోటి 40 లక్షలు బీసీ శాఖ భరించడానికి ఒప్పందం కుదిరింది. భవన నిర్మాణానికి 2013 నవంబర్ 28న అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం భవన నిర్మాణానికి మంజూరు ఇవ్వడంలో ఆసక్తి చూపకపోవడానికి రాజకీయపరమైన కారణాలంటూ ప్రతిపక్షాలు పలుమార్లు ఆరోపించాయి. ప్రస్తుత ప్రభుత్వం రూ.3కోట్ల అంచనాతో భవన నిర్మాణానికి కొత్త ప్రక్రియను ప్రారంభించింది. ఎంపీ హోదాలో పొన్నం ప్రభాకర్ కేటాయించిన రూ.50 లక్షలు విడుదల అయినా ప్రభుత్వం మంజూరు ఇవ్వకపోవడంతో అలానే ఉండిపోయాయి.
అద్దె భవనంలో కొనసాగింపు
ప్రస్తుతం పోటీపరీక్షల సీజన్ కావడంతో బీసీ స్టడీసర్కిల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం మంకమ్మతోటలో అద్దె భవనంలో స్టడీసర్కిల్‌ను ఇబ్బందుల మధ్య నిర్వహిస్తున్నారు. ఒకటో అంతస్తులో కార్యాలయం, రెండోఅంతస్తులో డైనింగ్, మూడు, నాలుగు అంతస్తుల్లో బాలికల, బాలుర హాస్టళ్లను నిర్వహించడానికి వీలుగా నిర్మించనున్న భవనం పూర్తయితే అభ్యర్థులకు ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి త్వరగా స్టడీసర్కిల్ భవన నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.