బంద్‌లపై నిర్బంధం!
ఓటుకు నోటు నేపథ్యంలో పోలీసులకు మౌఖిక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతూ.. ఇందుకు ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనన్న ఆరోపణలతో ప్రతిష్ట దిగజారుతుండటంతో దీన్నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. బాబు తీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు భారీ స్థాయిలో చేపడుతున్న నిరసనలతో వాస్తవాలు ప్రజలకు చేరతాయనే ఉద్దేశంతో అవి విజయవంతం కాకుండా వ్యూహరచన చేస్తోంది.
ఇందులో భాగంగా ఎక్కడికక్కడ నిర్బంధం పెంచనుంది. జిల్లా ఎస్పీలకు, పోలీసు కమిషనర్లకు ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా నిరసనలు, బంద్ వంటివి విజయవంతమైతే అందుకు స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల్నీ బాధ్యుల్ని చేస్తామంటూ హెచ్చరించింది. అసాధారణ పరిస్థితుల్లో మినహా ఈ తరహా నిరసనలకు సాధారణంగా అనుమతులు ఇస్తుంటారు. ప్రస్తుతం చంద్రబాబుకు, సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడానికి ఎవరైనా అనుమతులు కోరితే..
వివిధ కారణాలను సాకుగా చూపి అనుమతులు నిరాకరించాలని పోలీసు విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులిస్తే ఆయా పార్టీ శ్రేణులు మినహా సాధారణ ప్రజలు ఆయా నిరసనల్లో పాలు పంచుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎవరైనా బంద్‌కు పిలుపునిస్తే ఆయా ప్రాంతాల్లో బంద్‌కు నేతృత్వం వహించే, చురుకుగా పాల్గొనే వారిని ముందస్తు అరెస్టులు చేయాలని స్పష్టం చేసింది.
వైఎస్సార్సీపీ ఆందోళనలపై కేసులు
డోన్: ఓటుకు కోట్ల వ్యవహారంలో చంద్రబాబు తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బి.రాజేంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములుతో పాటు 10 మంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం తెల్లవారుజామున కోట్రికె హరికిషన్, బి.ప్రసాద్, కేడీ ప్రభాకర్, మొలకన్న, సుదర్శన్‌రెడ్డి, రంగస్వామి గౌడ్లను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ బెయిల్‌కు అనుమతించారు.
ఆదోనిలో 25 మందిపై : ఆదోని పాతబస్టాండ్ సర్కిల్లో ఆందోళన చేశారంటూ పోలీసులు 25 మందిపై కేసు నమోదు చేశారు.