కట్టల పాముల కలకలం
– పాత నోట్లు రద్దై 9 నెలలు గడస్తున్నా నేటికీ చలామణి
– 15 రోజుల వ్యవధిలో రూ. 2కోట్లకు పైగా పట్టుకున్న పోలీసులు
– రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో పాతనోట్లు పట్టివేత
కరువు జిల్లా ‘అనంత’లో ‘నోట్ల కట్టల’ పాములు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మాత్రమే పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో రూ. 2 కోట్లు పాతకరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత కరెన్సీ రద్దు చేసి దాదాపు 9 నెలలు కావస్తోంది. మరి ఈ పాత కరెన్సీ ఎక్కడ నుంచి వస్తోంది? ఇన్ని రోజుల పాటు ఎందుకు నిల్వ చేసుకున్నారు.? పాత కరెన్సీ మార్పిడి ముఠా జిల్లా ఉందా? ఉంటే వారు ఎక్కడ మార్పిడి చేస్తున్నారు? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి.
అనంతపురం సెంట్రల్: నవంబర్‌లో అప్పటి వరకు చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేసింది. వాటి స్థానంలో రూ.500, రూ.2వేల కొత్త కరెన్సీని విడుదల చేసింది. పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి.. కొత్త కరెన్సీని మార్చుకున్నారు. అందరూ కొత్తనోట్లకు అలవాటుపడుతున్నారు. అయితే ఇటీవల పెద్ద ఎత్తున పాతనోట్లు పట్టుబడుతున్నాయి. శనివారం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నిందితులు గుంతకల్లుకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా రూ. కోటి నగదును మార్పిడి చేసేందుకు యత్నిస్తుండగా అనంతపురం త్రీటౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నెల 13న పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు చెందిన ఓ నిందితుడు మరో 10 మందితో కలిసి రూ. కోటి పాతకరెన్సీని మార్పిడి చేసేందుకు బెంగుళూరుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
జిల్లాలో పాత నోట్ల మార్పిడి ముఠా?
వరుసగా బయటపడుతున్న ఇలాంటి ఘటనలను బట్టి చూస్తే జిల్లాలో పాతనోట్లు మార్పిడి ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం పట్టుబడిన నిందితుల్లో గుంతకల్లు చెందిన బాషా పాతనోట్ల మార్పిడి విషయంలో సిద్ధహస్తుడుగా పేరొందినట్లు సమాచారం. దీంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన కీలక నిందితుడు కమీషన్ పద్ధతిలో పాత నోట్లు మార్పిడి చేయాలని యత్నిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే జిల్లా కేంద్రంలో పాత నోట్ల మార్పిడి ముఠా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బెంగూళూరులో ఈ తరహా ముఠా సభ్యులు ఉన్నట్లు, వారి ద్వారా ఎన్ఆర్ఐల కోటాలో పాత నోట్లను మార్పిడి చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 50 శాతం కమీషన్‌పై పాతనోట్లను మార్పిడి చేసుకుంటున్నట్లు సమాచారం. డిమాండ్ బట్టి రూ. కోటి పాత నోట్లకు రూ. 25 లక్షలు కొత్త కరెన్సీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక సరిహద్దులో ఉండడంతోనే సమస్య
జిల్లాలో పాతనోట్లు మార్పిడి చేస్తామని కొంతమంది బ్రోకర్లు, ఏజెంట్లు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మన జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉండడంతో బెంగుళూరు నుంచి కొంతమంది వస్తున్నట్లు సమాచారం. ఇటీవల రెండు ఘటనలో కీలక నిందితులు పట్టుబడాల్సి ఉంది. వారు పట్టుబడితే పాతనోట్లు ఎలా మార్పిడి చేస్తున్నారనే అంశం బయటపడుతుంది. పాతనోట్లు మార్పిడి చేసుకునేందుకు ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేదు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుబడితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం నిందితులపై కఠినచర్యలు తీసుకుంటాం.
- జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ