‘నోషనల్’ బాధితులు 20 వేల మంది
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ రికార్డుల ప్రకారం నోషనల్ ఖాతా నెంబర్లు కలిగిన రైతులు జిల్లాలో దాదాపు 20వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఖాతా నెంబర్లను రెవెన్యూ అధికారులు తాత్కాలిక ప్రాతిపదిక ఇస్తారు. ఈ నెంబర్లు ఉన్న భూములను రిజిస్ట్రేషన్లు చేయవద్దని ప్రభుత్వం అదేశించడంతో రైతుల్లో గగ్గోలు మొదలైంది. రిజిస్ట్రేషన్ తరువాత కొందరు పట్టాదారు పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకోరు. అటువంటి సందర్భాల్లో అధికారులు తాత్కాలికంగా 100000, 100001 అంకెల్లో నోషనల్ నెంబర్లు ఇస్తారు. భూముల వ్యవహారాలు కోర్టుల్లో ఉన్నపుడు కూడాఇలా నెంబర్లు ఇస్తారు. అప్పటికప్పుడు పని జరగడానికి వీటిని ఇస్తారు. శాశ్వత ఖాతా నెంబర్లు 1 నుంచి 4 అంకెల్లోపు మాత్రమే ఉంటాయి. నోషనల్ నెంబర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి లక్ష నుంచి మొదలవుతాయి.
మండలాల వారీగా ఆరా..!
నోషనల్ ఖాతా నెంబర్లు కలిగిన భూములను రిజిస్ట్రేషన్లు నిర్వహించరాదని ఆదేశాలు వెలువడిన నేప«థ్యంలో మండలాల వారిగా వాటి వివరాలు సేకరిస్తున్నారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 20 వేల వరకు ఉన్నా.. గ్రామాల వారీగా ఎన్ని ఉన్నాయో లెక్కిస్తున్నారు. ఈ వివరాలు పక్కాగా వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపుతారు.