నోవా స్పెషాలిటీ అపోలో పరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌కు చెందిన అపోలో హెల్త్, లైఫ్‌స్టైల్ (ఏహెచ్‌ఎల్‌ఎల్) నోవా స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను కైవసం చేసుకుంది. డీల్ విలువ రూ.135-145 కోట్ల వరకు ఉంటుంది. నోవా స్పెషాలిటీ భారత్‌లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబైతోసహా పలు నగరాల్లో 10 ఆసుపత్రులను, ఒమన్‌లోని మస్కట్‌లో ఒక హాస్పిటల్ నిర్వహిస్తోంది. ఇక నుంచి ఈ ఆసుప్రతులు అపోలో బ్రాండ్‌తో కొనసాగనున్నాయి. ఏహెచ్‌ఎల్‌ఎల్ ప్రాథమిక ఆరోగ్య సేవలను 100కు పైగా కేంద్రాల ద్వారా భారత్, మధ్యప్రాచ్య దేశాల్లో అందిస్తోంది. అపోలో షుగర్ క్లినిక్స్, క్రాడిల్ వంటి బ్రాండ్లలో ప్రత్యేక వైద్య సేవలను విస్తరించింది. డే సర్జరీ కేంద్రాల నుంచి అయిదేళ్లలో రూ.500 కోట్ల వ్యాపారాన్ని అపో లో లక్ష్యంగా చేసుకుంది. మాధ్యమిక స్థాయి ఆరోగ్య సేవల విభాగంలో అపార అవకాశాలు ఉన్నాయని అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైసెస్ జేఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. ముంబై, జైపూ ర్, కాన్పూర్ వంటి కొత్త నగరాలకు అపోలో అడుగు పెట్టేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని అన్నారు.
టర్నోవర్ రూ.125 కోట్లు: నోవా మెడికల్‌కు చెందిన నోవా స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో చిన్న చిన్న శస్త్ర చికిత్సలు, మాధ్యమిక స్థాయి వైద్య సేవలను అందిస్తారు. 45 ఆపరేషన్ థియేటర్లు, 350కి పైగా పడకల సామర్థ్యముంది. నోవా స్పెషాలిటీ 2014-15లో రూ.115-125 కోట్ల దాకా టర్నోవర్ నమోదు చేసే అవకాశం ఉంది. బ్రేక్ఈవెన్కు 18-24 నెలల్లో చేరుకోవచ్చని అపోలో ఆశిస్తోంది. ఇన్వెస్టరు సురేష్ సోని, ప్రముఖ వైద్యుడు మహేష్ రెడ్డితోపాటు జీటీఐ గ్రూప్‌నకు ఇందులో వాటా ఉంది.