పురుషుల దినోత్సవం గుర్తుందా?
మెన్టోన్
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సంగతి కొత్తగా చెప్పాలేంటి? మాకు తెలీదూ! అని విసుక్కోకండి. మహిళా దినోత్సవం మొదలైన అచిరకాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. అది మహిళల ఘనతకు నిదర్శనం. కాదనలేం. ఆకాశంలో సగమైన వారికి ప్రత్యేకించి ఒక రోజు ఉండటం సమంజసమే! మరి జనాభాలో మిగిలిన సగమైన మగాళ్ల సంగతేమిటి? వాళ్లకూ ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలి కదా! ఔను! ఉండాలి కూడా! అందుకే, ‘మగా’నుభావులకూ ఒక ప్రత్యేకమైన రోజు ఉంది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్ 19న వస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజు వస్తుందో ఆడా మగా అందరికీ తెలుసు గానీ, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడొస్తుందనేది చాలామంది పురుషులకు కూడా తెలీదు. పురుషాధముల జనరల్ నాలెడ్జి ఈ స్థాయిలో తగలడిందని విసుక్కోకండి. కారణాలను తరచి చూసేందుకు ప్రయత్నించండి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి పురుషులకు కూడా పెద్దగా తెలియకపోవడానికి పెద్దపెద్ద కారణాలేవీ లేవు. అవన్నీ చాలా చిన్నవే. వాటిలో ప్రచారలోపం ముఖ్య కారణం. పురుషులలో సంఘటిత శక్తి లోపించడం, చట్టాలు, ప్రభుత్వాలకు అనాదిగా గల మహిళా పక్షపాతం కూడా ఇందుకు కారణాలే!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా మహిళలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయడం విజ్ఞత గల జంటిల్మన్ లక్షణం. వారిదైన ప్రత్యేక దినోత్సవాన్ని ఎంత సంబరంగా, అర్థవంతంగా జరుపుకొంటున్నారో చూసైనా పురుషపుంగవులు ఎంతో కొంత నేర్చుకుంటే మంచిది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా అదే రీతిలో జరుపుకొనేలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు మొదలుపెడితే ఇంకా మంచిది.
మన దేశంలో ఇలాంటిదేదీ తలపెట్టే ఉద్దేశం మన ప్రభుత్వాలకు ఉంటుందనుకోవడం భ్రమే గానీ, కొన్నింటిని పోరాటంతోనైనా సాధించుకోవాల్సి ఉంటుంది. పురుషుల పట్ల సానుకూలంగా ఉండటంలో మనవాళ్లు రుమేనియా ప్రభుత్వాన్ని చూసైనా నేర్చుకోవాలి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా ఇక నుంచి అధికారికంగా నిర్వహించాలని రుమేనియా పార్లమెంటు ఇటీవలే తీర్మానాన్ని ఆమోదించింది. అయినా, మన పార్లమెంటులో ఇలాంటి చిన్నా చితకా అంశాలపై చర్చలెందుకు జరుగుతాయిలెండి?