ఈ ఏడాదిలోనూ మొండి బకాయిల బండే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త సంవత్సరం కూడా దేశీయ బ్యాంకింగ్ రంగానికి కలిసొచ్చేట్లు కనిపించడం లేదు. అనూహ్యంగా పెరుగుతున్న నిరర్ధక ఆస్తులు అందర్నీ భయపెడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం కోలుకోకపోతే 2015 మార్చి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల విలువ 7 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటే పరిస్థితి ఎంత గడ్డుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2013 సెప్టెంబర్ నాటికి స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.6 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా నిరర్ధక ఆస్తులు పెరుగుతుండటంతో వచ్చే మూడు నెలల్లో నికర నిరర్థక ఆస్తులు రూ.1.50 లక్షల కోట్లకు చేరుతాయని అసోచామ్ సర్వేలో తేలింది.
2012 సెప్టెంబర్ నాటికి రూ.1.67 లక్షల కోట్లుగా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తులు... ఏడాది తిరిగేసరికి అంటే 2013 సెప్టెంబర్ నాటికి రూ.2.29 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇది మొత్తం రుణాల్లో 4.6 శాతానికి సమానం. ఇదే సమయంలో బ్యాంకులు పునర్వ్యవస్థీకరిం చిన రుణాల విలువ రూ. నాలుగు లక్షల కోట్లను తాకింది. ఇది మొత్తం రుణాల్లో 10.2 శాతానికి సమానం. పునర్వ్యవస్థీకరించిన రుణాలు ఈ స్థాయికి చేరుకోవడం దేశీయ బ్యాంకింగ్ చరిత్రలో ఇదే ప్రధమమని, ఇది ఆందోళన కలిగించే అంశమే అయినా, పరిస్థితి చేయిదాటిపోలేదని ఆర్బీఐ పేర్కొనడం విశేషం. ప్రస్తుత ముగిసిన త్రైమాసికంతోపాటు మరో త్రైమాసికంలో కూడా ఎన్పీఏలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్ రాజేంద్రన్ తెలిపారు. ఈ త్రైమాసికంలో మరో రూ.3,000 కోట్ల విలువైన రుణాలను పునర్ వ్యవస్థీకరించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆంధ్రాబ్యాంక్ మొత్తం రుణాల్లో 13 శాతం పునర్ వ్యవస్థీకరించగా, 5 శాతం నిరర్థక ఆస్తులున్నాయి. అంటే 18 శాతం ఆస్తుల నుంచి ఎలాంటి ఆదాయం రావట్లేదన్న మాట.
రియల్టీ పరిస్థితి ఘోరం
నిరర్థక ఆస్తుల విషయంలో రియల్టీ రంగం బాగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దాదాపు 13,200 యూనిట్లకు సంబంధించిన రుణాలు ఎన్పీఏలుగా మారిపోయాయి. వీటి విలువ దాదాపు రూ.7,700 కోట్లకు సమానమని, వీటిని వేలం వేయడానికి బ్యాంకులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఎన్పీఏసోర్స్ డాట్ కామ్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో 2,200 యూనిట్లు వాణిజ్య సముదాయాలు, 11,000 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రూ.27,500 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ రుణాల్లో 15 శాతం ఎన్పీఏలుగా మారాయి. రెసిడెన్షియల్ ఎన్పీఏల విషయంలో రాష్ట్రం రూ.497 కోట్లతో మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో ముంబై, ఢిల్లీలున్నాయి.
ఎన్నికల తర్వాతే...
ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఎన్నికల తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 4.6%గా ఉన్న ఎన్పీఏలు 2015 మార్చి నాటికి 4.4 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మెరుగవకుండా మరింత దిగజారితే మాత్రం ఎన్పీఏలు 7 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆర్బీఐ వ్యాఖ్యానించడం గమనార్హం.