మెరుగైన సౌకర్యాల దిశగా చర్యలు
ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్
సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే వారి నుంచి పతకాలు ఆశించగలమని, అందుకే ఆ దిశగా చర్యలు ప్రారంభించామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ అన్నారు. భారత క్రీడా జర్నలిస్టుల సమాఖ్య (ఎస్జేఎఫ్ఐ) కన్వెన్షన్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను బాధ్యతలు స్వీకరించినప్పుడు... తన మదిలో ప్రధానంగా రెండే అంశాలున్నాయన్నారు. ఐఓఏపై నిషేధం ఎత్తివేయించడం, సంఘాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడమే తన లక్ష్యంగా ఉన్నాయన్నారు. ఇప్పుడిక మరో 50 రోజుల్లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలు, ఆ తరువాత జరిగే ఆసియా క్రీడల పైనే ప్రస్తుతం తమ దృష్టని చెప్పారు.
క్రీడాకారుల శ్రమతోనే పతకాలు
ఏ టోర్నీలోనైనా క్రీడాకారుల కఠోర శ్రమ వల్లే దేశానికి పతకాలు లభిస్తున్నాయి తప్ప.. క్రీడా సమాఖ్యల వల్ల కాదని రామచంద్రన్ అన్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లకు ప్రభుత్వ సహకారంతోపాటు స్పాన్సర్‌షిప్‌లు లభించేలా చూడాల్సిన బాధ్యత సమాఖ్యలపై ఉందని, ముందుగా సమాఖ్యలు అంకితభావం, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరముందని ఐఓఏ అధ్యక్షుడు సూచించారు. తాము ఇప్పటికే కొన్ని కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రభుత్వ నిధులపై ఎక్కువగా ఆధారపడకుండా క్రీడల పట్ల ఆసక్తి గల కంపెనీలతో స్పాన్సర్ చేయించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశంలోని 38 క్రీడా సమాఖ్యలు, 29 రాష్ట్రాల ఒలింపిక్ సంఘాలు తలచుకుంటే అదేమంత పెద్ద పని కాబోదని రామచంద్రన్ అభిప్రాయపడ్డారు.
మాజీ అథ్లెట్ల సలహాలు స్వీకరిస్తాం
దేశంలో క్రీడల్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు నిన్నటితరం అథ్లెట్ల సలహాలు, సూచనలు తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఐఓఏ అధ్యక్షుడు తెలిపారు. వారి అనుభవం తప్పక ఉపయోగపడుతుందన్నారు. క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చెందాలంటే ఎక్కువ రాష్ట్రాల్లో జాతీయ క్రీడలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడు ప్రభుత్వాలే క్రీడలకు నిధులు కేటాయిస్తాయని వివరించారు.