ఆగస్టు 5న విజేందర్ బౌట్
తొలి టికెట్ సచిన్‌కు
ముంబై: భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, చైనా స్టార్ జుల్పికర్ మమటియలి మధ్య బౌట్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలో ఆగస్టు 5న ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరుగనుందని నిర్వాహకులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వర్లీలోని ఎన్ఎస్సీఐ స్టేడియంలో ఈ బౌట్ జరగనుంది. తొలి టికెట్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఆయన నివాసంలో స్వయంగా విజేందరే అందజేయనున్నాడు. ప్రొఫెషనల్ కెరీర్లో భారత స్టార్‌ది అజేయమైన రికార్డు.
డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ చాంపియన్ అయిన విజేందర్... డబ్ల్యూబీఓ ఒరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇది ఒక రకంగా డబుల్ టైటిల్ బౌట్. ఇందులో గెలిచిన బాక్సర్ తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు... ప్రత్యర్థి టైటిల్‌ను ఎగరేసుకుపోతాడు. మీడియా సమావేశంలో విజేందర్ మాట్లాడుతూ ‘జుల్పికర్‌తో ఆగస్టు 5న జరిగే పోరుకు సిద్ధంగా ఉన్నా.
ఎడంచేతి వాటమున్న యువకుడు నన్ను నాకౌట్ చేస్తాననడం వింటే నవ్వొచ్చింది. చైనాకు నా సత్తా ఏంటో ఆ బౌట్లో చూపిస్తా’ అని అన్నాడు. మేటి శిక్షణ కోసం తాను బుధవారం మాంచెస్టర్‌కు పయనమవుతున్నట్లు చెప్పాడు. నిజానికి ఈ పోరు మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సివున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.