ఎన్ఎస్పీ క్వార్టర్ల విక్రయం ఎప్పుడో?
హాలియా, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ వాసులకు సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. డ్యామ్ నిర్మాణం నుంచి పనిచేసి రిటైర్డ్ అయిన అధికారులు, డ్యామ్ నిర్మాణంలో పాల్గొన్న కూలీల వారసులు తాము నివాసం ఉంటున్న ఎన్ఎస్పీ క్వార్టర్లను తమకే ఇవ్వాలని 20 ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం సాగర్‌లో మిగులు క్వార్టర్లు విక్రయించేందుకు మూడేళ్ల క్రితం 1653 జీఓ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రభుత్వమైనా తమకు మిగులు క్వార్టర్లు విక్రయించాలని సాగర్వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఉద్యోగ, కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఈఈ, ఏఈ, ఏ, బీ, బీ2, సీ, డీ, ఈ1, టైఫ్కు చెందిన సుమారు 4500 క్వార్టర్లను నిర్మించింది. అందులో కొన్నింటిని 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం అర్హులైన పేదలకు కనీస ధరకే విక్రయించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పరిధిలో 1600 క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో నీటిపారుదల శాఖ అధికారులతోపాటు, విద్య, వైద్య, ఆరోగ్య, విద్యుత్, పోస్టాఫిస్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఉద్యోగులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా నివాసం ఉంటున్నారు.
40 ఏళ్లుగా క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారు వాటిని తమకే కేటాయించాలంటూ రెండు దశాబ్ధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. 2005లో నాగార్జునసాగర్‌లో జరిగిన సాగర్ స్వర్ణోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నాటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎన్ఎస్పీ సిబ్బంది కలిసి క్వార్టర్లు తమకే కేటాయించాలని కోరారు. ఇందుకు రాజశేఖరరెడ్డి సానుకూలంగా స్పందించారు. 2009 సాధారణ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కుందూరు జానారెడ్డి సైతం తనను గెలిపిస్తే.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే క్వార్టర్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారికే కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ప్రజల ఒత్తిడి మేరకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2011లో ప్రాజెక్ట్ అవసరాలకు పోను మిగిలిన క్వార్టర్ల సంఖ్య నిర్ధారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే చేసిన ఎన్ఎస్పీ అధికారులు ఇరిగేషన్, ఇతర శాఖల అవసరాలు పోను 459 క్వార్టర్లను విక్రయించవచ్చునని ప్రభుత్వానికి నివేదించారు.
గతంలో ఆందోళన.....
ప్రాజెక్టు పరిధిలోని మిగులు క్వార్టర్ల విక్రయంలో 1653 జీఓకు విరుద్ధంగా ఎన్ఎస్పీ అధికారులు వ్యవహరించడంపై గతంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. 1653 జీఓ ప్రకారం ఎన్ఎస్పీ క్వార్టర్ల విక్రయంలో మొదట ఇరిగేషన్ శాఖ ఉద్యోగులకు, ఆ తరువాత రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అర్హులను పక్కనపెట్టి ఇతరులు 89 మందికి క్వార్టర్లు కేటాయింపు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో కలత చెందిన ఉద్యోగులు గత ఫిబ్రవరి మాసంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డిని సైతం ఘెరావ్ చేశారు. దీంతో సీఈ ఎల్లారెడ్డి స్పందించి 89మందికి క్వార్టర్స్ విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు ఇరిగేషన్ సెక్రటరీతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు ఆందోళన కూడా విరమించారు. అయితే సీఈ ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో మాట్లాడకపోవడంతో క్వార్టర్ల విక్రయం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఆలస్యమైందని, వెంటనే సీఈ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సాగర్వాసులు కోరుతున్నారు.
459 క్వార్టర్ల విక్రయానికి 1653 జీఓ జారీ
నాగార్జునసాగర్‌లో ఉన్న మిగులు క్వార్టర్ల విక్రయించేందుకు 2011, ఆగస్టు 22న ప్రభుత్వం 1653 జీఓ జారీ చేసింది. దీని ప్రకారం క్వార్టర్ల విక్రయంలో మొదటి ప్రాధాన్యం ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి, రెండో ప్రాధాన్యం రిటైర్డ్ ఉద్యోగులకు, మూడో ప్రాధాన్యం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారికి, చివరి ప్రాధాన్యం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాల్సి ఉంది. క్వార్టర్ల విక్రయానికి సంబంధించి భూమి వాల్యుయేషన్ నిర్ధారించే బాధ్యతను రెవెన్యూ అధికారులకు, ప్రస్తుతం క్వార్టర్లలో ఎవరు నివాసం ఉంటున్నారు, విక్రయానికి వారు అర్హులా..కాదా అన్న విషయాలను నిర్ధారించే బాధ్యతను ఎన్ఎస్పీ అధికారులకు అప్పగించారు. ఇలా ఆయా అంశాలను పరిశీలించిన అధికారులు 149 మందితో మొదటి లిస్టును తయారు చేశారు.