పాకిస్తాన్కు ఆహ్వానం లేదు
ఐఎఫ్ఆర్పై సమాచారం మాత్రమే ఇచ్చిన కేంద్రం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్ఆర్ -2016)లో పాకిస్తాన్ పాల్గొనడం లేదు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ను ఆహ్వానించలేదు. నౌకాదళ పాటవాన్ని ప్రదర్శించడంతోపాటు ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు ఐఎఫ్ఆర్-2016కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు నిర్వహించే ఐఎఫ్ఆర్లో దాదాపు 60 దేశాలు పాల్గొననున్నాయి.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చైనా, రష్యా, ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలతోపాటు ఆగ్నేయాసియా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. వ్యూహాత్మక కారణాల దృష్ట్యా పాకిస్తాన్ను ఐఎఫ్ఆర్కు ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఐఎఫ్ఆర్ నిర్వహిస్తున్నట్లు విదేశాంగ శాఖ పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశానికి కొన్ని నెలల క్రితమే లాంఛనప్రాయంగా సమాచారం ఇచ్చింది. ఎందుకంటే ఐఎఫ్ఆర్లో భాగంగా దేశ సముద్ర జలాల్లో యుద్ధ నౌకల కదలికలు, విన్యాసాలు ఉంటాయి. దీనిపై పొరుగు దేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే పాకిస్తాన్కు ఐఎఫ్ఆర్కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.