ఎన్టీపీసీ లాభం రూ. 3,094 కోట్లు
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 3,0934 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 4,382 కోట్లు ఆర్జించింది. ఇంధన వ్యయాలు పెరగడం లాభాలను దెబ్బకొట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఇంధన వ్యయాలు రూ. 10,390 కోట్ల నుంచి రూ. 14,434 కోట్లకు ఎగశాయి. ఇదే కాలానికి ఆదాయం మాత్రం రూ. 72,098 కోట్ల నుంచి రూ. 78,922 కోట్లకు పుంజుకుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) విస్తరణపై రూ. 22,400 కోట్లమేర పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. గడిచిన ఏడాది(2013-14) రూ. 21,705 కోట్లను వెచ్చించింది. గతేడాది 233 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది 240 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టింది.
14,000 మెగావాట్లు అదనం
ప్రస్తుతం 43,000 మెగావాట్ల సామర్థ్యంగల కంపెనీ 2017కల్లా అదనంగా 14,038 మెగావాట్ల విద్యుత్‌ను జత కలుపుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ సీఎండీ అరుప్ రాయ్ చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 6,000 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుకున్నట్లు తెలిపారు. వాటాదారులకు షేరుకి రూ. 1.75 డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర 3% ఎగసి రూ. 129 వద్ద ముగిసింది.