టీటీడీపీ నేతలు రాష్ట్ర ద్రోహులు: హరీశ్‌రావు
అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నవారిని ఆదుకోరా
ఎన్టీఆర్ చరిత్రలో చంద్రబాబు వెన్నుపోటుకో పేజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా గోరంతలను కొండంతలుగా ప్రచారం చేస్తూ టీటీడీపీ నేతలు రాష్ట్ర ద్రోహానికి పాల్పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంపా గోవర్ధన్, చింతా ప్రభాకర్, బాలరాజుతో కలసి అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను భూతద్దంలో చూపించారు. తెలంగాణలో ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ. 50 వేల చొప్పున టీడీపీ నేతలు ఇచ్చిండ్రు. అనంతపురంలో రోజుకు ముగ్గురు రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అనంతపురంలో మృత్యుఘోష టీడీపీకి వినిపించదా? వారిని ఎందుకు పట్టించుకోరు? అనంతపురం రైతులకు ప్రభుత్వం తరఫున, పార్టీ తరపున పరిహారం ఎందుకివ్వరు? తెలంగాణలో శవరాజకీయాలు చేయడానికే నష్టపరిహారం ఇస్తున్నరా? కరెంటు చార్జీలపై ప్రశ్నిస్తే రైతులను కాల్చిచంపిన చరిత్ర టీడీపీది.
శవాల పేరుతో రాజకీయాలు తప్ప రైతులపై ఆ పార్టీకి ప్రేమలేదు’ అని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్టీఆర్ పేరును తెలంగాణలోని విమానాశ్రయానికి పెట్టాలని కొట్లాడటం పెద్దమోసమన్నారు. గొడ్డుకన్నా ఘోరం, గాడ్సేకన్నా హీనం అని చంద్రబాబును ఎన్టీఆర్ స్వయంగా తిట్టిన విషయం ఓసారి గుర్తుతెచ్చుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు అదే ఎన్టీఆర్ పేరును పెట్టాలని అడగడం రాజకీయ దిగజారుడుతనం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే సీమాంధ్రలో పాఠ్యాంశంగా చేర్చాలని సవాల్ చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరిస్తే చంద్రబాబు వెన్నుపోటు గురించి ఒక పేజీ ఉంటుందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
సభ ముందుకు డీఎల్ఎఫ్ ఫైలు..
శాసనసభ ముందు డీఎల్ఎఫ్కు సంబంధించిన ఒరిజినల్ నోట్‌ఫైల్స్ పెట్టినట్టుగా హరీశ్‌రావు తెలిపారు. ఇలాంటి పారదర్శకమైన ప్రభుత్వం ఇప్పటిదాకా ఎక్కడా లేదన్నారు. గతంలో విద్యుత్ పీపీఏలకు సంబంధించిన ఫైలును సభ ముందు పెట్టాలని అడిగితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సభను వాయిదా వేసుకుని పారిపోయాడని ఎద్దేవా చేశారు.