ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి ‘మెడికల్ బిల్లులు’
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల పరిశీలన బాధ్యతల్ని ఇకపై ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబాల వారు ఎవరైనా ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చేయించుకుంటే దానికైన ఖర్చును ప్రభుత్వం నుంచి పొందేందుకు వైద్య విద్యా సంచాలకులకు బిల్లులు ఇచ్చేవారు.
అక్కడ పరిశీలించిన బిల్లులను తిరిగి సొంత శాఖకు పంపిస్తే, అక్కడ చెల్లించేవారు. ఇప్పుడు పరిశీలన ప్రక్రియను వైద్య విద్యాశాఖ నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు ఇచ్చారు. ప్రస్తుతం మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు ఆన్లైన్ ప్రక్రియ లేదని, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.