'హుదూద్'కు 51 సహాయక బృందాలు
న్యూఢిల్లీ : హుదూద్ తుఫాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్టీఆర్ఎఫ్) 51 సహాయక బృందాలను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 బృందాలను తరలిస్తోంది. శ్రీకాకుళం-2, విజయనగరం-1, విశాఖ-1, తూర్పు గోదావరి జిల్లా-1 బెటాలియన్లను పంపుతోంది. విశాఖపట్నం, భువనేశ్వర్ కేంద్రంగా సహాయ కార్యక్రమాలు అందించనుంది. బాధితు ప్రాంతాలకు 162 బోట్లు, 54మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేసింది. విశాఖపట్నంలో ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్స్‌ను డీఐజీ పర్యవేక్షించనున్నారు.
తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని పరికరాలను ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లనున్నాయి. మరోవైపు 'హుదూద్' తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఈ తుఫాను మరింత బలపడనున్నట్లు వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీర, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించింది.